హైదరాబాద్లో కిడ్నీ దందా.. ఒక్కో కిడ్నీ రూ.55 లక్షలు

హైదరాబాద్లో కిడ్నీ దందా.. ఒక్కో కిడ్నీ రూ.55 లక్షలు
  • రూ.55 లక్షలకు ఓ కిడ్నీ చొప్పున అమ్మకం 
  • సరూర్​నగర్ అలకనంద హాస్పిటల్​లో అక్రమ ఆపరేషన్లు 
  • ఆసుపత్రి సీజ్.. నిర్వాహకుడి అరెస్ట్
  • ఆపరేషన్లు చేసిన డాక్టర్లు పరార్ 

దిల్ సుఖ్ నగర్, వెలుగు: హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ దవాఖాన అడ్డాగా కొనసాగుతున్న కిడ్నీ దందా గుట్టు రట్టయింది. పర్మిషన్లు లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని, ఒక్కో కిడ్నీని రూ. 55 లక్షలకు అమ్ముతున్నారని ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

 జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జీల పేరుతో అనుమతి తీసుకుని ఆరు నెలల కింద ఆసుపత్రిని ప్రారంభించిన నిర్వాహకులు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి డోనర్లను రప్పించి కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్లు చేస్తున్నట్లు గుర్తించారు.  మంగళవారం ఆస్పత్రిపై అధికారులు దాడులు చేపట్టడంతో పేషెంట్లను అక్కడే వదిలేసి డాక్టర్లు పరారయ్యారు. 

అధికారులు ఆసుపత్రిని సీజ్ చేయగా.. నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో సుమంత్​గట్టుపల్లి అనే డాక్టర్ గతేడాది జులైలో అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​ప్రారంభించాడు. 

జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీల నిర్వహణకు రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ నుంచి అనుమతి తీసుకున్నాడు. 9 బెడ్లకు పర్మిషన్లు తీసుకుని నాలుగు ఫ్లోర్లలో దాదాపు 30 బెడ్లు ఏర్పాటు చేశాడు. అయితే, అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా కొనసాగుతోందని మంగళవారం రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావుకు ఫోన్​ద్వారా సమాచారం వచ్చింది. 

అప్రమత్తమైన ఆయన డిప్యూటీ డీఎంహెచ్ఓ గీత, సరూర్ నరగ్ పీహెచ్​సీ డాక్టర్ గీత, ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఏసీపీ కృష్ణయ్యతో కలిసి ఆసుపత్రిపై దాడి చేశారు. పోలీసులను చూసిన డాక్టర్లు పరారయ్యారు. 

అక్కడ చికిత్స పొందుతున్న నలుగురు పేషెంట్లను అధికారులు విచారించారు. తమిళనాడుకు చెందిన నస్రీనా బాను(35), ఫిరోజ్ బేగం(40) నుంచి కిడ్నీలు తీసుకుని కర్నాటకకు చెందిన బీఎస్ రాజశేఖర్(68), కృపాలత(45)కు ఈ నెల17న ట్రాన్స్ ప్లాంటేషన్ చేసినట్లు గుర్తించారు. చికిత్స పొందుతున్న ఆ నలుగురిని వెంటనే మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రి సీజ్.. నిర్వాహకుడు అరెస్ట్ 

అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ సుమంత్ ను సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి, పోలీసులను చూసి పరారైన డాక్టర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

నిబంధనలకు విరుద్ధంగా గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్న ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు వెల్లడించారు. పరారైన వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు డీసీపీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.  

హెల్త్ మినిస్టర్ సీరియస్.. విచారణకు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు:  అలకనంద హాస్పిటల్‌లో అక్రమంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వ్యవహారంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సీరియస్​అయ్యారు. ‌ఈ కిడ్నీ రాకెట్​కు సంబంధించి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి డిటైల్స్​ తెప్పించుకుని పరిశీలించారు.

 ఈ వ్యవహారంతో  సంబంధం ఉన్న డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్లు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

ఒక్కో కిడ్నీ రూ.55 లక్షలు..  

తమిళనాడుకు చెందిన ప్రైవేట్​డాక్టర్ పవన్, ప్రదీప్ అనే వ్యక్తిని మధ్యవర్తులుగా పెట్టుకుని ఈ కిడ్నీ దందా కొనసాగించినట్టు అధికారులు గుర్తించారు. రూ. 55 లక్షలకు బేరం కుదుర్చుకుని ఒక్కో కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్ ఆపరేషన్ చేస్తున్నట్టు సమాచారం. జనవరి 17న నస్రీన్ బాను నుంచి కిడ్నీ సేకరించి.. కిడ్నీ రిసీవర్​కు ట్రాన్స్​ప్లాంటేషన్ చేసినట్లు జిల్లా వైద్య అధికారులు గుర్తించారు.