హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. సిటీలోని సరూర్ నగర డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకనంద ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతోందన్న సమాచారంతో హాస్పిటల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు.అమాయకుల్ని ఆసరాగా చేసుకొని అలకనంద హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నారని తెలిపారు పోలీసులు.
ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి.. పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్ తో కుమ్మక్కయి కిడ్నీ లను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. కిడ్నీ రాకెట్ దందా బయటపడటంతో మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ వద్దకు చేరుకుని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు.
హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నలుగురు పేషెంట్స్ ను అంబులెన్స్ లో గాంధీ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ పై పోలీసులు దాడి చేయటంతో ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు హాస్పిటల్ డాక్టర్లు. వీళ్లంతా కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులని తెలిపారు పోలీసులు.