
- నిమ్స్ డాక్టర్ల రికార్డ్
హైదరాబాద్, వెలుగు: నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అరుదైన రికార్డ్ సాధించారు. 24 గంటల్లో నలుగురికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు చేశారు. ఈ నెల19న సాయంత్రం నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు ఈ ట్రాన్స్‌ప్లాంట్స్ చేసినట్టు నిమ్స్ యూరాలజీ విభాగం ప్రకటించింది. ఇందులో మూడు కెడావర్ ట్రాన్స్‌ప్లాంట్స్ కాగా, ఒకటి లైవ్ ట్రాన్స్‌ప్లాంట్ అని డాక్టర్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఖలీద్ అహ్మద్, కరీంనగర్‌కు చెందిన స్వాతిక ఐదేండ్ల నుంచి, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన సంతోష్ నాలుగున్నరేండ్ల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. బ్రెయిన్ డెడ్అయిన డోనర్ల నుంచి సేకరించిన కిడ్నీలను ఈ ముగ్గురికి అమర్చారు. అలాగే, హైదరాబాద్‌కు చెందిన వెంకటలక్ష్మీ అనే పేషెంట్‌కు ఆమె భర్త కిడ్నీ డొనేట్ చేయగా దానిని ఆమెకు అమర్చారు.
ప్రస్తుతం ఈ నలుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. నిమ్స్ యూరాలజీ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సర్జరీలలో డాక్టర్లు విద్యాసాగర్, రాంచంద్రయ్య, రఘువీర్, చరణ్ కుమార్, ధీరజ్, వినయ్, సునీల్, అరుణ్, జానకి, విష్ణు, పవన్, హర్ష సూరజ్, అనంత్, శంకర్, ఇందిర, గీత, పద్మజ, నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్స్ డాక్టర్లను అభినందిస్తూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. నలుగురికి నిమ్స్ డాక్టర్స్ కొత్త జీవితం ఇచ్చారని పేర్కొన్నారు. నిమ్స్ లో ఇదో రేర్ ఫీట్‌గా ఆయన అభిప్రాయపడ్డారు. సర్కారు దవాఖాన్లలో ఇంత తక్కువ టైమ్‌లో 4 ట్రాన్స్‌ప్లాంట్ లు చేయడం అరుదు.