T20 Cricket: టీ20 క్రికెట్‌లో ఒక్కడే 900 సిక్సర్లు.. గేల్ ఆల్‌టైం రికార్డ్‌పై వెస్టిండీస్ ఆటగాడు గురి

T20 Cricket: టీ20 క్రికెట్‌లో ఒక్కడే 900 సిక్సర్లు.. గేల్ ఆల్‌టైం రికార్డ్‌పై వెస్టిండీస్ ఆటగాడు గురి

వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ టీ20 క్రికెట్‌లో ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి  ఇప్పటివరకు టీ20 క్రికెట్ లో సూపర్ ఫామ్ తో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్ కు వీడ్కోలు పలికినా ప్రపంచ టీ20 లీగ్ ల్లో తన హవా సాగిస్తున్నాడు. తన టీ20 కెరీర్ లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న పొలార్డ్..ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్ లో 900 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 

ముంబై ఎమిరేట్స్ తరపున ఆడుతున్న ఈ విండీస్ వీరుడు గురువారం (జనవరి 16) డెసర్ట్ వైపర్స్‌ పై జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. పొలార్డ్ కంటే ముందు ఈ రికార్డును సాధించిన ఏకైక ఆటగాడు క్రిస్ గేల్. గేల్ ఓవరాల్ గా తన టీ20 కెరీర్ లో మొత్తం 1,056 సిక్సర్లు కొట్టి అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. పొలార్డ్ మరో మూడేళ్లు టీ20 క్రికెట్ లో కొనసాగితే గేల్ రికార్డ్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Also Read :  ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

 2006 లో టీ 20 క్రికెట్ ప్రారంభించిన ఈ విండీస్ ఆల్ రౌండర్.. ఇప్పటివరకు 690 మ్యాచ్‌లు ఆడాడు. అతని కెరీర్‌లో ఒక సెంచరీతో పాటు 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రెండు టీ20 వరల్డ్ కప్ లు గెలిచిన జట్టులో సభ్యుడు. 37 ఏళ్ల పొలార్డ్..వెస్టిండీస్ తరపున 101 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 1,569 పరుగులు చేసి 44 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ గా సేవలను అందిస్తున్నాడు. 

టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్ల వీరులు 

క్రిస్ గేల్ - 1,056 సిక్సర్లు

కీరన్ పొలార్డ్ - 901 సిక్సర్లు

ఆండ్రీ రస్సెల్ - 727 సిక్సర్లు

నికోలస్ పూరన్ - 593 సిక్సర్లు

కోలిన్ మున్రో - 550 సిక్సర్లు

అలెక్స్ హేల్స్ - 534 సిక్సర్లు

రోహిత్ శర్మ - 525 సిక్సర్లు

గ్లెన్ మాక్స్‌వెల్ - 522 సిక్సర్లు

జోస్ బట్లర్ - 509 సిక్సర్లు

డేవిడ్ మిల్లర్ - 494 సిక్సర్లు