Hundred Ball League: పొలార్డ్ విధ్వంసం.. వరుసగా 5 బంతుల్లో 5 సిక్స్‌లు

ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న మెన్స్ హండ్రెడ్ బాల్ లీగ్ టోర్నీలో విండీస్ విధ్వంసకర బ్యాటర్ కీరన్ పోలార్డ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా చలామణి అవుతోన్న ఆఫ్ఘన్ మాంత్రికుడు రషీద్ ఖాన్‌ను ఊచకోత కోశాడు. అతని బౌలింగ్‌లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాదాడు. దాంతో, మ్యాచ్ ఫలితమే మారిపోయింది.  

6, 6, 6, 6, 6

హండ్రెడ్ బాల్ లీగ్‌లో భాగంగా శనివారం(ఆగష్టు 10) సదరన్ బ్రేవ్, ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 10 బంతుల్లో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. క్రిస్ జోర్గాన్(3/22), జోఫ్రా ఆర్చర్(2/18) కట్టడిగా బౌలింగ్ చేశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌథెర్న్ బ్రేవ్ 80 బంతులు ముగిసేసరికి 6 వికెట్లు నష్టపోయి 78 పరుగులు చేసింది. వారి విజయానికి చివరి 20 బంతుల్లో 49 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో పొలార్డ్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు.    

రషీద్ ఖాన్ వేసిన వరుస 5 బంతులను స్టాండ్స్ లోకి పంపాడు. దాంతో, 5 బంతుల్లోనే 30 పరుగులు రావడంతో మ్యాచ్ స్వరూపమూ మారిపోయింది. అప్పటివరకూ మ్యాచ్ ట్రెంట్ రాకెట్స్ వైపు ఉంటే, ఆ ఐదు బంతుల దెబ్బకు సదరన్ బ్రేవ్ విజయం సాధించింది. పొలార్డ్ విధ్వంసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.