నగల కోసం మహిళను చంపేసిన్రు..     ముగ్గురు నిందితుల అరెస్ట్​

కామారెడ్డి , వెలుగు: నగల కోసం ఓ మహిళను హత్య చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం కామారెడ్డి ఎస్పీ బి.శ్రీనివాస్​రెడ్డి తెలియజేశారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన నర్సవ్వ (35) పని మీద  ఈనెల 15న కామారెడ్డికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్లలేదు. ఆమె కుటుంబసభ్యులు 16వ తేదీన టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్​ కేసుగా నమోదు చేసి ఎంక్వైరీ చేశారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా అందులో  ఓ ఆడ, మగ మనిషితో మాట్లాడినట్లు కనిపించింది.

వీరు రామారెడ్డికి చెందిన భార్యాభర్తలు ఆస ప్రశాంత్, సుకన్యగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. నర్సవ్వ కూలీ పని కోసం అప్పుడప్పుడు కామారెడ్డికి వస్తుండడంతో వీరు పరిచయమయ్యారు. దర్ణి ఎల్లయ్య కూడా వీరికి కలిశాడు. వీరంతా రామారెడ్డికి వెళ్లి  ఆస ప్రశాంత్​ ఇంట్లో కల్లు తాగారు. మత్తులోకి వెళ్లిన తర్వాత నర్సవ్వ మెడకు తాడు చుట్టి హత్య చేశారు.  ఒంటిపై ఉన్న నగలు తీసుకుని డెడ్​బాడీని రాజన్న సిరిసిల్ల జిల్లా  నర్మల సమీపంలోని కాల్వలో పడేశారు. ప్రశాంత్​, సుకన్య,  ఎల్లయ్యలను అరెస్టు చేసి  రూ.లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.