ఇందల్వాయి, వెలుగు : గత నెల 23న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లి శివారులో జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం ఇందల్వాయి పీఎస్‌లో ఏసీపీ కిరణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. తీర్మాన్‌పల్లికి చెందిన షేక్ నబీసాబ్(24), మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన జావీద్, బిహార్‌కు చెందిన సికేంద్రకుమార్, రోహిత్‌కుమార్, ధర్మేంద్ర కుమార్ ఏప్రిల్23న గ్రామ శివారులో లిక్కర్ తాగారు. బిహరీలు తమకు గంజాయి కావాలని నబీసాబ్, జావీద్‌ను అడిగారు. జావీద్ గంజాయి ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి రూ. 1000 తీసుకుని పారిపోయాడు. దీంతో అక్కడే ఉన్న నబీసాబ్ను బీహరీలు తమ రూంకు తీసుకెళ్లి తూపాకీతో బెదిరించారు. శివారులోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి గొంతు నులిమి చంపేశారు.
నిందితులను గురువారం ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేసి ఓ తుపాకి, రెండు బుల్లెట్లు, టూ వీలర్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కేసు ఛేదించిన డిచ్పల్లి సీఐ కృష్ణ, ఎస్సై నరేశ్, కానిస్టేబుల్స్ రాజేశ్వర్, సర్ధార్, లింగం, రఘు, రంజిత్, శ్రీనివాస్, కిశోర్‌లను అభినందించారు.