- యాదాద్రిలో 1.47 లక్షల టన్నులు పెండింగ్
- సూర్యాపేటలో 2.19 లక్షల టన్నులు, నల్గొండలో 1.01 లక్షల టన్నులు పెండింగ్
- ఇకనుంచి బ్యాంకు గ్యారెంటీ ఇస్తేనే మిల్లర్లకు వడ్లు
యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : సీజన్లు మారుతున్నా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అందించడంలో జిల్లాకు చెందిన మిల్లర్లు లేట్ చేస్తున్నారు. మూడో సీజన్ సమీపించినా ఒక్క సీజన్ బియ్యం పూర్తిగా అందించడం లేదు. గడువులోపు బియ్యం ఇవ్వాలని, లేకుంటే ఫైన్ వేస్తామని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నా మిల్లర్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వానాకాలం సీజన్ సీఎంఆర్ బియ్యం మార్చిలో, రబీ సీజన్ బియ్యం సెప్టెంబర్ అప్పగించాలి. కానీ కొన్ని మినహా అన్ని మిల్లులు జాప్యం చేస్తున్నాయి.
యాదాద్రిలో 1.47 లక్షల టన్నులు పెండింగ్
2023 వానాకాలం సీజన్‌కు సంబంధించి 47 మిల్లులకు 2,65,197 టన్నుల వడ్లు అప్పగించారు. దీంట్లో 1,77,682 టన్నుల సీఎంఆర్ డెలీవరీ చేయాల్సి ఉండగా 1,42, 145 (80 శాతం) టన్నులు డెలివరీ చేశారు. 47 మంది మిల్లర్లలో కేవలం 8 మంది మాత్రమే వంద శాతం సీఎంఆర్ అప్పగించారు. -2023–-24 యాసంగి సీజన్ వడ్లు 37 మిల్లులకు 2,70,635 టన్నుల వడ్లను అప్పగించగా.. 1,81,325 టన్నుల సీఎంఆర్ అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకూ 68,903 టన్నులు అంటే 38 శాతం డెలివరీ చేశారు. ఈ సీజన్ ఏ ఒక్క మిల్లు కూడా వంద శాతం సీఎంఆర్ ఇవ్వలేదు.
సూర్యాపేటలో 2.19 లక్షల టన్నులు
సూర్యాపేటలో 2023 వానాకాలంలో 1,96 లక్షల టన్నుల వడ్లను 63 మిల్లులకు కేటాయించింది. 1.39 లక్షల టన్నుల సీఎంఆర్ అప్పగించాల్సి ఉంది. ఇంకా 78,190 టన్నుల సీఎంఆర్ పెండింగ్ లో ఉంది. -2023 -–24 యాసంగిలో 2.08 లక్షల టన్నుల వడ్లను 47 మిల్లులకు కేటాయించింది. 1,63,200 టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 22 వేల టన్నుల సీఎంఆర్ అందించారు.
నల్గొండలో 1.01 లక్షల టన్నులు
2023 వానాకాలంలో జిల్లాలోని మిల్లులకు 3,22,754 టన్నుల వడ్లు అప్పగించగా 2,17,577టన్నుల సీఎంఆర్ అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ 1,95,827 టన్నులు (90 శాతం అప్పగించారు. మరో 21750 టన్నులు పెండింగ్‌లో ఉంది. -2023-24 యాసంగి సీజన్లో 3,26,012 టన్నుల వడ్లు అప్పగించగా 2,21,569 టన్నుల సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా 1,41,586 టన్నులు (64 శాతం) అప్పగించారు. ఇంకా 79,983 టన్నులు పెండింగ్‌లో ఉంది.
మిల్లులపై ఆర్ ఆర్ యాక్ట్
సీఎంఆర్ కోసం ఇచ్చిన వడ్లు మిల్లుల్లో లేక పోవడంతో సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని కొన్ని మిల్లులను ఇప్పటికే ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. దీంతో పాటు ఆయా మిల్లులను సీజ్ చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేసింది. రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ కూడా ప్రయోగించింది. ఆ మిల్లర్ల ఆస్తులను వేలం వేయడం ద్వారా బకాయిని రాబట్టుకునే ప్రక్రియ నడుస్తోంది.
మరికొందరు మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఆలస్యంగా సీఎంఆర్ ఇచ్చిన వారి నుంచి 25 శాతం అదనంగా వసూలు చేస్తామని హెచ్చరించినా పట్టించుకోని మిలర్లకు 25 శాతం పెనాల్టీ విధించారు.
అయితే ఈ పెనాల్టీ కట్టకుండా ఎలాగైనా తప్పించుకోవాలని కొందరు మిల్లర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల్లోని ఒక్కో మిల్లులో రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ విలువైన బియ్యం అందించాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలోని రెండు మిల్లులు మాత్రం రూ. 60 కోట్ల నుంచి రూ . 100 కోట్ల విలువైన బియ్యం అందించాల్సి ఉంది.