నేటి సమాజంలో ఎవరి లైఫ్ వాళ్లు చూసుకోవడానికే టైమ్ ఉండట్లేదు. ఇక పక్క వాడి జీవితంలో ఏం జరుగుతోందో చూసే సమయం ఎక్కడిది? నాలుగు రోజులు ఎవడో ఏదో అనుకుంటాడని మన బతుకు, మన బిడ్డల బతుకు ఆగం చేసుకునుడేంది? బిడ్డలు ఇష్టపడి చేసుకోవాలన్న ప్రేమ పెళ్లికి అడ్డుపడడం, తెలియకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ల ప్రాణాలనే తీయాలనుకోవడం రాతి యుగంలో కూడా జరిగి ఉండదు. ముఖ్యంగా భారతదేశంలో మనం పూజించే దేవుళ్లు, రుషులు, ఆ తర్వాత రాజులు ఎందరో కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్లున్నారు. మన భారత సంస్కృతి, సంప్రదాయాల్లో ఎక్కడా కులాంతర, ప్రేమ వివాహాలను తప్పుగా చూపిన దాఖలాలు లేవు. అలాంటిది నేటి ఆధునిక ప్రపంచంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిని కిరాతకంగా చంపడం అనేది కచ్చితంగా తనలోని మానవత్వాన్ని చంపేసుకోవడమే. ఒక్కసారి ఆలోచన చేస్తే ఏ పేరెంట్స్ కూడా ఈ పని చేయరు. అసలు హత్య చేస్తే పరువు నిలబడుతుందనుకోవడం మూర్ఖత్వం కాదా?
నేడు మనం 21వ శతాబ్దంలో బతుకుతున్న నాగరికులం. అలాంటిది నేటికీ కులం, కులం అని క్యాస్టిజం చూపించే వాళ్లుండడం బాధాకరం. పరువు పేరు చెప్పి పిల్లల ప్రాణాలు తీస్తున్న వాళ్లు మన పక్కనే బతుకుతున్నారన్నది కఠోరమైన నిజం. కులాంతర వివాహాలు చేసుకుంటే పరువు పోతుందని ఆలోచనే పిచ్చి భ్రమ! ఇక పోయిన పరువును హత్య చేసి, బిడ్డల జీవితాలను ఆగం చేసి తిరిగి నిలబెట్టుకోవచ్చన్న ఫీలింగ్ ఆ పిచ్చికి పరాకాష్ట. మనిషిని చంపడమే అత్యంత దుర్మార్గం? అటువంటిది ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను హింసించి, పెండ్లి కూతురు ముందే పెండ్లి కొడుకును ఆ అమ్మాయి తల్లిదండ్రులే చంపడం అంటే.. ఇలాంటి ఘటనలను ఖండించడానికి సరైన పదాలు కూడా దొరకడం లేదు. ఏ కులాన్నో, మతాన్నో కించపరచాలన్న ఆలోచన నాలో లేదు. కేవలం కులాంతర వివాహాలు చేసుకున్నంత మాత్రాన ప్రాణాలు తీయాలన్న ఆలోచనలు రావొద్దని విజ్ఞప్తి చేయడమే నా ఉద్దేశం.
ఆ హత్యలు ఎవరి కోసం?
ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ల జీవితం సుఖంగా ఉండదన్నది ఎక్కువ మంది పెద్దలు చెప్పుకొచ్చే మాట. సరే పెద్దలు చూసి చేసిన పెళ్లిళ్లన్నీ సక్సెస్ అవుతున్నాయా? మంచి, చెడు అనేవి ఎందులో అయినా ఉంటాయి. ప్రేమ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించే వాళ్లూ ఉన్నారు. కష్టాలు పడేవాళ్లూ ఉంటారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారనో, వేరే కులం వాళ్లను కట్టుకున్నారనో కూతురి భర్తను, లేదా దంపతులిద్దరినీ చంపేస్తున్నవాళ్లున్నారు. దీనికి కారణమేంటని అడిగితే పరువు పోతోందనేవాళ్లు ఎంత మంది ఉన్నారో, బిడ్డ కట్టుకున్న వాడితో సుఖంగా ఉండలేదనే వాళ్లూ అంతే సంఖ్యలో ఉంటారు. కానీ ఎంతగానో ప్రేమించి, కావాలని పెళ్లి చేసుకున్న జంటలో అమ్మాయినో, అబ్బాయినో చంపేస్తే మిగిలిన రెండో వ్యక్తి సంతోషంగా ఉండగలరా? అప్పటికే పిల్లలు పుట్టి ఉంటే వాళ్ల పరిస్థితి ఏంటి? ఇంత చేసి హత్యలకు పాల్పడిన తర్వాత ఆ తల్లిదండ్రులేమైనా సుఖంగా ఉండగలరా? జైళ్లపాలవుతారు. ఇది పరువు తక్కువ కాదా? మరి ఎవరి కోసం ఆ హత్యలు జరుగుతున్నట్లు.
మంచి, చెడూ చూడడమే తల్లిదండ్రుల ధర్మం
పిల్లలకు సమయాన్ని కేటాయించలేని తల్లిదండ్రులు అసలు పిల్లల్నే కనకూడదన్నది ‘చలం’ సలహా. ఇది అక్షరాలా నిజం. పిల్లల్ని చూసుకునే సమయం, తీరిక లేక కొంతమంది, చదువులు, కెరీర్ పేరుతో కొంత మంది పిల్లల్ని హాస్టల్స్ లో పడేస్తున్నారు. వాళ్లతో ప్రేమగా దగ్గర గడిపే సమయం చాలా తక్కువే ఉంటోంది. ఇంకా మరికొందరు తల్లిదండ్రులైతే ఎదో తమ పెద్దరికం తగ్గిపోతుందన్నట్టు పిల్లల దగ్గర సీరియస్ గా ఉంటుంటారు. నేటి ప్రపంచంలో ఉద్యోగాలు, బిజినెస్ లు చేస్తూ తల్లిదండ్రులిద్దరూ బిజీబిజీగా గడిపేయడం సహా ఇలా రకరకాల కారణాల వల్ల పిల్లలకు సరైన టైమ్ ఇవ్వడం లేదు. ప్రేమగా కొంచెం సేపు పక్కన కూర్చుని మాట్లాడే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఇదంతా ఒకవైపు అయితే.. సహజంగా పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే తమ తోటి ఈడు వాళ్ల స్నేహాన్ని కోరుకుంటారు. ఇలా ఏర్పడే స్నేహంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఆప్యాయత, కేరింగ్ పెరిగితే అది ప్రేమగా మారుతుంది. నిజంగా ప్రేమించే వాళ్లు దొరికి, జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బతికితే అలాంటి ప్రేమను అందరూ గౌరవించాలి. మిగతా సమయంలో ఎలా ఉన్నా ఇక్కడే తల్లిదండ్రులు తమ బాధ్యతను సరిగా నెరవేర్చాలి. పిల్లల ప్రేమ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మంచి, చెడులను ఎంచి, వాళ్లకు జీవితానికి ఏది సరైనదో అది చేసే పెద్ద మనసు చూపాలి. అది పిల్లల నిర్ణయాన్ని ఆహ్వానించినా, రిజెక్ట్ చేసినా సరే! అసలు ఒకరిపై ప్రేమ పెంచుకునే విషయాన్నే ముందుగా తల్లిదండ్రులతో పంచుకోగలిగే పరిస్థితులు ఉండాలి. పిల్లలు కూడా ఏదైనా అనిపించగానే ఆవేశంగా నిర్ణయాలు తీసేసుకోకుండా.. అది ప్రేమో, వ్యామోహమో గుర్తించి, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడి బతకగలరా లేదా అన్నది బేరీజు వేసుకోవాలి. తల్లిదండ్రులకు దీన్ని అర్థమయ్యేలా చెప్పగలగాలి.
మన సంస్కృతిని అర్థం చేసుకోవాలి
భారతదేశం ఏనాడో గొప్ప ఆదర్శాలను నెలకొల్పింది. మన పురాణ కాలం నుంచే కులాంతర, ప్రేమ వివాహాలను తప్పుగా ఎప్పుడూ చెప్పలేదు. శ్రీకృష్ణుడు పుట్టింది వసుదేవుడికే అయినా పెరిగింది యాదవుడిగానే. ఆయన ఎనిమిది మంది భార్యల్లో ఒకరైన జాంబవతి ఆదివాసీ మహిళ. ఇక వశిష్టుడు పెండ్లాడిన అరుంధతి దళిత స్త్రీ. భారతదేశానికి అనే పేరుకు మూలంగా చెప్పే భరతుడిదీ ప్రేమ వివాహమే. ఇక ఆధునిక భారతంలో ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ ని పెళ్లి చేసుకున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ తన మొదటి భార్య చనిపోయాక సబిత అనే బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నారు. ఈ చరిత్రను, సంస్కృతిని అర్థం చేసుకుంటే కులాంతర, ప్రేమ వివాహాలను తప్పుబట్టేవాళ్లకు కనువిప్పు కలుగుతుంది. నాలుగు రోజులు ఎవరో ఏదో అనుకుంటే తమ పరువు పోతుందన్న అర్థంలేని ఆలోచనతో పిల్లల జీవితాలను నాశనం చేయరు. కులాంతర వివాహాలను ప్రోత్సహించకపోయినా కనీసం వాళ్ల బతుకు వాళ్లను బతకనిస్తే చాలు. దయచేసి చంపకండి.
కులమంటే పని.. అందులో పరువేంది?
కులం అనేది మనిషి చేసే పనిని బట్టి వచ్చిందే. సమాజ అభివృద్ధి క్రమంలో కొందరు వ్యవసాయం చేస్తే, మరికొందరు ఇతర వృత్తులు చేయడం అవసరమైంది. నాగలి చేయడానికి, ఇంటికి తలుపులు, కిటికీలు, ఇంట్లోకి మంచాలు, కుర్చీలు చేసేవాళ్లు వడ్రంగి పని వారు, లోహపు పరికరాలు తయారుచేస్తే కంసాలి అన్నారు. బట్టలు నేస్తే పద్మశాలి అన్నారు. బట్టలు ఉతికితే రజకుడు, శుభకార్యాల్లో మంగళవాయిద్యాలు వాయించినా, క్షవరం చేసినా మంగలి ( నాయీ బ్రాహ్మణులు), పొలాలకు నీళ్లు పెడితే నీరటి, పూజలు పునస్కారాలు చేస్తే బ్రాహ్మణులు, పరిపాలన చేస్తే క్షత్రియులు అని, వ్యాపారం చేస్తే వైశ్యులు అని ఇలా ఎవరి వృత్తిని బట్టి వారి కులాన్ని పిలవడం మొదలైంది. వృత్తి నైపుణ్యం గల వారు, ఆ మెలకువలు తెలిసినవారు వారి కుటుంబాల్లోనే పెండ్లి జరిగితే ఆ వృత్తి సాగించడంలో ఇబ్బంది ఉండదని ఒకే కులంలో పెండ్లి చేసుకోవడం పూర్వం అవసరంగా మారింది. అదే తర్వాత కాలంలో ఆచారం, కులం కట్టుబాటుగా మారింది. కాలం మారిన కొద్దీ వృత్తులు మారుతున్నాయి. ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, క్యాబ్ డ్రైవర్లు, టీచర్లు, ఇంజనీర్లు, బ్యాంకు ఉద్యోగులు, పరిశ్రమల యజమానులు, కార్మికులు ఇలా రకరకాల వృత్తులు వచ్చాయి. అన్ని కులాల వారు అన్ని వృత్తులు చేస్తున్నారు. నేడు కులంతో సంబంధం లేకుండా అందరూ ఒకప్పటి కుల వృత్తులను చేస్తున్నప్పుడు, కులానికి పరువు అనే లింక్ ఎక్కడిది అన్న విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
– జస్టిస్ బి చంద్ర కుమార్
హైకోర్టు రిటైర్డ్ జడ్జి
For More News..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కోహ్లీ
బైడెన్ సర్కారులో కీలక పదవిలో ఇండో-అమెరికన్
అమెరికాలో కరోనాతో ఒక్కరోజే 3,260 మంది బలి