సియోల్: రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే అమెరికా, దక్షిణ కొరియా దేశాలను సమూలంగా నాశనం చేయడానికి రెడీగా ఉండాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన సైన్యానికి స్పష్టం చేశారు. ఇక ఉత్తర, దక్షిణ కొరియా దేశాల విలీనం ఎప్పటికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు శత్రుదేశాల మాదిరిగా మారిపోయాయని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఉత్తర కొరియా నేషనల్ మీడియా( కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) సోమవారం వెల్లడించింది. అమెరికా నుంచి వచ్చే ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైనికులకు కిమ్ సూచించినట్లు తెలిపింది. 2024 నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే, కిమ్ తన ఆయుధ పరీక్షలను పెంచాలని చూస్తున్నట్లు ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.
ఆదివారం కమాండింగ్ ఆర్మీ ఆఫీసర్లతో కిమ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..‘ దేశాన్ని కాపాడటానికి కత్తులకు పదును పెట్టడం చాలా అవసరం. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, దక్షిణ కొరియా చర్యలు చేపట్టవచ్చు. ఒకవేళ అలా జరిగితే.. క్షణం కూడా సంకోచించవద్దు. వెంటనే సైన్యాన్ని సమీకరించి వారిని పూర్తిగా నాశనం చేయాలి.
ఘోరమైన ఎదురు దాడితో వారిని దెబ్బకొట్టాలి’ అని ఆర్మీ ఆఫీసర్లకు కిమ్ సూచించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. గత వారం కూడా కిమ్ మాట్లాడుతూ.. కొత్తగా మరో మూడు మిలిటరీ స్పై శాటిలైట్లను ప్రయోగిస్తామని, మరిన్ని అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తామని, ఎటాక్ డ్రోన్‌లను అభివృద్ధి చేస్తామని చెప్పారు.