- అక్కడే మూడో తరగతి వరకు బోధన: సీఎం రేవంత్
- అదనంగా మరో టీచర్ నియామకం
- 4 నుంచి 12వ తరగతి వరకుసెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూల్స్
- స్టూడెంట్లకు ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు
- విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తం..
- విధానపత్రం రూపొందించండి విద్యావేత్తలతో భేటీలో సీఎం
హైదరాబాద్, వెలుగు: అంగన్వాడీలను ప్రీ స్కూల్స్ గా మార్చి, వాటిల్లో మూడో తరగతి వరకు బోధన అందించేలా తీర్చిదిద్దాలని యోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూళ్లలా మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు శుక్రవారం సెక్రటేరియెట్‌లో విద్యావేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, పీఎల్ విశ్వేశ్వరరావు, శాంతా సిన్హా, ఆల్దాస్ జానయ్య, పద్మజా షా, లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పాల్గొన్నారు. వాళ్లంతా విద్యా వ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ బలోపేతానికి త్వరలోనే విద్యాకమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యావేత్తల ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.
యూనివర్సిటీల్లో వీసీలు, సిబ్బంది నియామకం..
అంగన్‌వాడీల్లో సరైన సౌలతులు లేవని, అంగన్ వాడీ కార్యకర్తలకు బోధించే నైపుణ్యం ఉండట్లేదని సీఎం రేవంత్ దృష్టికి ప్రొఫెసర్లు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం.. ‘‘అంగన్ వాడీలను ప్రీ స్కూల్స్‌గా మార్చి, విద్యా బోధన కోసం వలంటీర్లను నియమించాలని యోచిస్తున్నం. వలంటీర్లకు అవసరమైన శిక్షణ అందజేస్తం. ప్రీస్కూల్స్ లోనే మూడో తరగతి వరకు బోధన అందేలా చూస్తం.
4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నం. ఆయా స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించాలనే ఆలోచన చేస్తున్నం” అని తెలిపారు. పదేండ్లుగా యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని సీఎం దృష్టికి ప్రొఫెసర్లు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన.. వీసీల నియామకానికి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశామని, త్వరలోనే నియామకాలు పూర్తవుతాయని చెప్పారు. వర్సిటీలకు డెవలప్‌మెంట్ గ్రాంట్స్ ఇవ్వాలని, అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య విజ్ఞప్తి చేశారు. విద్యా సూచికలో తెలంగాణ అట్టడుగున ఉందని, ప్రస్తుతం ఓయూలోనూ ప్రమాణాలు పడిపోయాయని ప్రొఫెసర్లు హరగోపాల్, శాంతా సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.
నేను, భట్టి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నం..
విద్యావ్యవస్థ బలోపేతానికి మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. విద్యావ్యవస్థలో తీసుకురావల్సిన మార్పులపై విధానపత్రం రూపొందిస్తే, దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రొఫెసర్లకు చెప్పారు. ఆయా అంశాలపై కేబినెట్ సబ్ కమిటీతోనూ చర్చించాలని వారికి సూచించారు.
విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రపంచ బ్యాంక్, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అతి తక్కువ వడ్డీకి దీర్ఘకాల రుణాలు ఇస్తాయని ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య చెప్పగా.. ఆ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 11 శాతంగా ఉన్న విద్యాశాఖ బడ్జెట్.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 6.4 శాతానికి పడిపోయిందని, బడ్జెట్ పెంచాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. దీనిపై స్పందించిన సీఎం.. తాను, డిప్యూటీ సీఎం భట్టి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, విద్యావ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంచుతామని హామీ ఇచ్చారు.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలని సీఎం నిర్ణయించారని, బడ్జెట్ కేటాయింపులు తప్పకుండా పెంచుతామని భట్టి తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కేకే, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం పాల్గొన్నారు.