బ్రిటిష్ చక్రవర్తి కింగ్ చార్లెస్ 3 క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా రిపోర్టులలో క్యాన్సర్ అని బయటపడింది. కింగ్ చార్లెస్ 3 ఏ క్యాన్సర్ తో బాధపడుతున్నరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇది ప్రోస్టేట్ కు సంబంధించిన కేన్సర్ కాదని మాత్రం స్పష్టం చేసింది.
ప్రస్తుతం చార్లెస్ 3 ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఆయన ఏ ఆసుపత్రిలో చేరలేదని, అతనికి ఇంట్లోనే చికిత్స కొనసాగుతున్నట్లుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. కాన్సర్ కారణంతో ఆయన కొన్ని రోజుల పాటు విధులకు దూరంగా ఉంటారని ప్యాలెస్ ప్రకటించింది.
మరోవైపు కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘చార్లెస్-3 త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని మోదీట్వీట్ చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చార్లెస్-3కి ప్రస్తుతం 75 ఏళ్లు.. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణంతో 2022 సెప్టెంబర్ 8న రాజుగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2023 మే 6న పట్టాభిషేకం చేశారు.
కాగా యూకేలో మహిళలతో పోలిస్తే పురుషులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, పురుషులకు వారి జీవితకాలంలో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యే అవకాశం ఇద్దరిలో ఒకరికి ఉంటుంది.