ఇక తెలంగాణలో కింగ్​ఫిషర్ ​బీర్లు కనిపించవా..? కింగ్​ఫిషర్ ​బీర్లు బంద్.. ఎప్పటివరకో క్లారిటీ వచ్చేసింది..

ఇక తెలంగాణలో కింగ్​ఫిషర్ ​బీర్లు కనిపించవా..? కింగ్​ఫిషర్ ​బీర్లు బంద్.. ఎప్పటివరకో క్లారిటీ వచ్చేసింది..
  • రేట్లు పెంచలేదని రాష్ట్రానికి బీర్ల సరఫరా ఆపేసిన యునైటెడ్‌‌  బ్రూవరీస్‌‌ 
  • 7 రకాల బీర్ల సప్లై నిలిపివేత
  • రిటైర్డ్​ జడ్జి నివేదిక వచ్చాకే ధరల పెంపుపై నిర్ణయం
  • యునైటెడ్‌‌  బ్రూవరీస్‌‌  ఒత్తిడికి తలొగ్గం: మంత్రి జూపల్లి
  • ధరలు పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని వెల్లడి

హైదరాబాద్​,వెలుగు :  రాష్ట్రంలో మద్యం ప్రియులకు షాక్​ తగిలింది. తెలంగాణకు బీర్ల సరఫరాను యునైటెడ్‌‌  బ్రూవరీస్‌‌ నిలిపివేసింది. దీంతో రాష్ట్రానికి ఏడు రకాలైన బీర్ల సరఫరా నిలిచిపోనుంది. గత ఐదేళ్లుగా ధరలు పెంచలేదని, అందువల్లే సరఫరా నిలిపివేస్తున్నామని యునైటెడ్  బ్రూవరీస్  లిమిటెడ్  (యూబీఎల్) ఓ ప్రకటనలో తెలిపింది. 2019 నుంచి ఇప్పటి వరకు బీర్ల ధరలు పెంచలేదని యూబీఎల్  పేర్కొన్నది. ఆ కంపెనీ నుంచే  రాష్ట్రానికి కింగ్​ ఫిషర్​  బీర్లు సప్లై అవుతున్నాయి. రాష్ట్రంలో వినియోగిస్తున్న బీర్ల పరిమాణంలో 88 శాతం తాము సరఫరా చేస్తున్న కింగ్ ఫిషర్  బ్రాండ్  ఉందని యూబీఎల్  పేర్కొంది.

ప్రతి సంవత్సరం తమ బీర్ల సరఫరా ద్వారా ప్రభుత్వానికి రూ.4500 కోట్ల  ఆదాయం వస్తున్నదని వివరించింది. పెరిగిన ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా ధరలు పెంచకపోవడం వల్ల సంస్థకు భారీగా నష్టాలు వస్తున్నాయని, అందువల్ల సరఫరా నిలిపివేశామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సెబీకి యూబీఎల్  ఓ లేఖ రాసింది. కాగా.. ఉన్నపళంగా యునైటెడ్   బ్రూవరీస్​ బీర్లు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్​కు సమాచారం అందించడంతో దీనిపై ప్రభుత్వం ఆరా తీసింది. సంక్రాంతి పండగ పూట యూబీ తీసుకున్న నిర్ణయంతో ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నది.  

గత ప్రభుత్వం రూ.2500 కోట్లు బాకీ పెట్టింది

మద్యం ధరల పెంపుపై విశ్రాంత హైకోర్టు జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరామని, నివేదిక వచ్చిన తర్వాతే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఎక్సైజ్‌‌  శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో బీర్ల విక్రయాలు నిలిపివేస్తామని యూబీఎల్‌‌  ప్రకటించిన నేపథ్యంలో ఆయన సెక్రటేరియేట్​ మీడియా సెంటర్​లో  మీడియాతో మాట్లాడారు. యూబీ కంపెనీ ఒత్తిడికి లొంగబోమని జూపల్లి స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ మిగతా రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే తక్కువ ధరలు ఉండేలా చూస్తామన్నారు.  

యూబీ బీర్లకు సంబంధించి ఇంకా 14 లక్షల కేసుల స్టాక్‌‌  ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు  తెలంగాణలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని, కర్నాటకలో బీరు బాటిల్  రూ.190, ఏపీలో రూ.180, తమిళనాడు, తెలంగాణలో రూ.150 గా ఉందని  జూపల్లి తెలిపారు. వివిధ బ్రాండ్ల బీర్ల ధరలు పెంచాలని కోరుతున్నారని, బీర్ల ధరలు 33.1 శాతం పెంచాలని యూబీ కంపెనీ కోరుతోందని మంత్రి వివరించారు. ధరలు పెంచితే మద్యం ప్రియులపై భారం పడుతుందన్నారు. ముడిసరకుల ధరలు పెరిగితే మద్యం ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు.

యూబీఎల్‌‌  కంపెనీ మార్కెట్‌‌  షేరు 69 శాతం ఉందన్నారు.  గత ప్రభుత్వం దాదాపు రూ.8 లక్షల కోట్ల వరకు అప్పులు, బకాయిలు పెట్టిందని మంత్రి తెలిపారు. ఇందులో రూ.40 వేల కోట్ల వరకు పెండింగ్​ బిల్లులు ఉన్నాయన్నారు.  వీటిలో ఎక్సైజ్‌‌  డిపార్ట్‌‌మెంట్‌‌  యూబీకి సంబంధించి రూ.2,500 కోట్ల వరకు ఉన్నట్లు మంత్రి వివరించారు.  ఇందులో కాంగ్రెస్‌‌  ప్రభుత్వం వచ్చాక రూ.1,139 కోట్ల బకాయిలు చెల్లించామని, ఇవాళ్టి వరకు మొత్తం రూ.658 కోట్లు పెండింగ్‌‌  ఉన్నట్లు మంత్రి వివరించారు.