మంత్రి తెలివి: రాజుల రాజ్యంలో మంత్రి ఎలా ఉండేవాడో తెలుసా

మంత్రి తెలివి: రాజుల రాజ్యంలో  మంత్రి ఎలా ఉండేవాడో తెలుసా

పూర్వం ధర్మపురి రాజ్యంలో సుకేతుడు అనే రాజు సుస్థిరమయిన రాజ్య పరిపాలన చేసేవాడు. అతని రాజ్యంలోని ప్రజలు చాలా సంతోషంగా ఎటువంటి బాధలు లేకుండా జీవించేవారు. సుకేతుడు యుద్ధానికి వచ్చిన రాజులను తన పరాక్రమంతో ఓడించి రాజ్యాన్ని కాపాడుతూ ఉండేవాడు. రాజ్యంలోని ప్రజలు కూడా యుద్ధ సమయంలో రాజుకు వెన్నంటే కదనరంగంలో నిలిచేవారు. 

తూర్పు దేశాన్ని పరిపాలించే బట్టిరాయుడు సుసంపన్నమైన ధర్మపురి రాజ్యంపై కన్నేశాడు. ధర్మపురి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఎన్నో ఎత్తుగడలు వేశాడు కానీ, అవి పారలేదు. చివరికి తన మిత్రదేశాలతో పొత్తు ఏర్పాటు చేసుకొని, పెద్దమొత్తంలో సైన్యాన్ని సమకూర్చుకుని ధర్మపురి రాజ్యంపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు. 


ఈ విషయాన్ని తెలుసుకున్న సుకేతుడు మంత్రి కన్నప్పను పిలిపించి ‘‘మహామంత్రి మన రాజ్యానికి పెద్ద విపత్తు రాబోతోంది. బట్టిరాయుడు మన రాజ్యానికి నలువైపులా ఉన్న రాజులతో పొత్తు కుదుర్చుకుని మన రాజ్యంపై దండెత్తడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం అందింది. అలా జరిగితే మన సైన్యం, ప్రజలు కలిసి యుద్ధం చేసినా ఓటమి తప్పదు. ఈ విపత్తు నుండి మన రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడడానికి ఏదైనా మార్గం ఆలోచించ’’మని ఆజ్ఞాపించాడు. 

అప్పుడు కన్నప్ప ‘‘మహారాజా! నాదొక విన్నపం. యుద్ధానికి సన్నాహాలు జరిగేలాగ మన రాజ్యంలో ఒక విందు, బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి నలువైపులా ఉన్న రాజులను యోధులను ఈ వినోద కార్యక్రమానికి ఆహ్వానిద్దాం’’ అని చెప్పాడు. మహారాజుకు మంత్రి ఆలోచన లోని తంత్రం అర్థమయింది. వెంటనే తమ అనుచరులను పిలిపించి రాజ్యానికి నలువైపులా ఉన్న రాజులను వారితో పాటు వారి దేశంలోనే గొప్ప యోధులను తీసుకుని విందుకు రమ్మని వర్తమానం పంపించాడు. 
ఆరోజు అన్ని దేశాల రాజులు, యోధులు ధర్మపురి రాజ్యానికి వచ్చారు కానీ, బట్టిరాయుడు రాలేదు. 

ధర్మపురి రాజ్యంలో అడుగుపెట్టినది మొదలు వచ్చిన అతిథులు రాచమర్యాదలకు తక్కువ కాకుండా సుకేతుడు, భటులు, దేశప్రజలు ఆహ్వానం పలికారు. సుకేతుడు ఏర్పాటుచేసిన విందుకు అతిథులందరూ ముగ్ధులైపోయారు. భూలోక స్వర్గానికి వచ్చామా? అన్న భ్రమలో మునిగిపోయారు. వచ్చిన రాజులందరు సుకేతుని మర్యాదలకు మురిసిపోయారు. విందు ముగిసిన తరువాత బలప్రదర్శన కార్యక్రమాలు మొదలయ్యాయి. 

వివిధ రాజ్యాల నుండి వచ్చిన యోధులను ధర్మపురి యోధులు ఓడించారు. ఇదంతా గమనించిన రాజులు ‘‘సుకేతుని రాజ్యంలో ప్రతిఒక్కరు గొప్ప యోధులే’’ అని వారిలో వారు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల సుకేతుడు ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నాడో అన్న సత్యాన్ని కళ్లారా చూసి తెలుసుకున్న నలువైపుల రాజులు సుకేతునితో మైత్రి ఒప్పందం చేసుకున్నారు. 

బట్టిరాయుడుతో కలిసి ధర్మపురిపై దండెత్తాలన్న తలంపు మానుకున్నారు. ఈ విషయం బట్టిరాయుడు చెవిన పడగానే తాను వేసిన పన్నాగం పారలేదని, ఏమీ చేయలేక అసూయతో రగిలిపోయాడు. సరైన సమయంలో కన్నప్ప ఇచ్చిన సలహా వల్ల యుద్ధం ఆగిందని సుకేతుడు రాజ్యసభలో కన్నప్పను ప్రశంసించి, ఎనలేని బహుమతులతో సత్కరించాడు.

- పుల్లట సంతోష్-