బలగం మొగిలయ్యకు సీరియస్‍

బలగం మొగిలయ్యకు సీరియస్‍
  •  వరంగల్​లోని ప్రైవేట్​హాస్పిటల్​లో ట్రీట్‍మెంట్  
  • ఆదుకోవాలంటున్న ఫ్యామిలీ 
  • స్పందించిన హెల్త్​ మినిస్టర్​

వరంగల్, వెలుగు : ‘తోడుగా మాతోడుండి నీడగా మాతో నడిచి..నువ్వెక్కడికెళ్లినావు కొమురయ్యా’ అంటూ బలగం సినిమాలో క్లైమాక్స్​పాటతో అందరినీ కన్నీరు పెట్టించిన బుడిగె జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య  ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్‍ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య మంగళవారం కండ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబసభ్యులు వరంగల్​లోని సంరక్ష హాస్పిటల్​లో చేర్పించారు. 

షుగర్ ​లెవెల్స్​ భారీగా పెరిగాయి. ఇప్పటికే 11 సర్జరీలు జరగ్గా, డయాలసిస్ చేసే క్రమంలో ఇబ్బందులు రాకుండా మరిన్ని సర్జరీలు చేయాల్సి అవసరం ఉందని డాక్టర్లు గుర్తించారు. టెస్టులకే రూ. 25 వేలు అవసరం కాగా భార్య అప్పు తెచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, తమ దగ్గర ట్రీట్​మెంట్​కు డబ్బులు లేవని మొగిలయ్య కుటుంబసభ్యులు చెబుతున్నారు.

 ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని కోరుతున్నారు. దాతలెవరైనా పస్తం కొమురమ్మ, అకౌంట్‍ నంబర్‍ 62306309034, ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍ SBIN0020655 ద్వారా హాస్పిటల్‍ ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.   

అధికారులకు మంత్రి  రాజనర్సింహ ఆదేశాలు

మొగిలయ్య అనారోగ్యం గురించి తెలుసుకున్న హెల్త్​ మినిస్టర్​ దామోదర రాజనర్సింహ మెరుగైన వైద్యం అందజేయాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశించారు.  దీంతో డయాలసిస్ చేయడానికి అవసరమైన మందులను అందజేశారు.  దగ్గరుండి మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

2023లో ‘వీ6 వెలుగు’ వార్తతో ఫ్రీ ట్రీట్‍మెంట్‍ 

మొగిలయ్యకు కరోనా టైంలో రెండు కిడ్నీలు ఫెయిల్‍ కావడంతో అప్పటినుంచి డయాలసిస్  తీసుకుంటున్నారు. బలగం సినిమాతో ఆయన కళ వెలుగులోకి వచ్చింది. అయితే..గతేడాది అకస్మాత్తుగా బీపీ, షుగర్‍ పెరగడంతో రెండు కండ్లపై ఎఫెక్ట్ పడింది. కొద్ది రోజులకు వరంగల్ సంరక్ష హాస్పిటల్​లో డయాలసిస్ చేస్తుండగా గుండెనొప్పి వచ్చింది. 

మొగిలయ్య దీనగాథపై 2023 మార్చి 30న వీ6 వెలుగులో  ‘బలగం మొగిలయ్యకు ఆపదొచ్చింది’ హెడ్డింగ్​తో కథనం పబ్లిష్​అయ్యింది. దీంతో అప్పటి హెల్త్​మినిస్టర్​హరీశ్​రావు స్పందించి బాధిత కుటుంబాన్ని ఫోన్​లో పరామర్శించారు. ట్రీట్‍మెంట్‍కు కావాల్సిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. చికిత్సకు తోడు ‘దళితబంధు’  పథకంలో ఆర్థిక సాయం కూడా చేశారు.