హోలీ థియేటర్స్‌‌‌‌లో సెలబ్రేట్ చేసుకోండి : కిరణ్ అబ్బవరం

హోలీ థియేటర్స్‌‌‌‌లో సెలబ్రేట్ చేసుకోండి : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా  విశ్వ కరుణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దిల్‌‌‌‌ రూబా’. రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్ హీరోయిన్స్.  రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ కలిసి నిర్మించిన ఈ సినిమా  హోలీ కానుకగా మార్చి 14న విడుదల కానుంది. రీసెంట్‌‌‌‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లవుతోంది. పది సినిమాలు చేశాను. నన్ను ఆదరిస్తున్న నా అభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తానని మాటిస్తున్నా. నాలా ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తున్న వారిలో ఓ పది మందికి ఏటా నా చేతనైనంత సాయం చేస్తా.   నా ప్రతి సినిమాలో 40 నుంచి 50 మంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నా. 

ఇక ‘దిల్ రూబా’ విషయానికొస్తే.. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాం.   ఈ నెల 13 సాయంత్రం నుంచి   ప్రీమియర్స్‌‌‌‌తో మా సక్సెస్ జర్నీ స్టార్ట్ కాబోతోంది. ఆడియెన్స్ అంతా  హోలీ పండుగను మా మూవీతో కలిసి థియేటర్స్‌‌‌‌లో సెలబ్రేట్ చేసుకోండి.  2 గంటల 20 నిమిషాల్లో ఎక్కడా బోర్ ఫీల్ రాదు. మహిళలపై ఉన్న గౌరవంతోనే ఈ సినిమా చేశాం.  ఇబ్బందిపడే ఒక్క డైలాగ్, ఒక్క సీన్ కూడా ఇందులో ఉండదు. ఇంత క్లీన్‌‌‌‌గా కమర్షియల్ సినిమా తీయగలరా అని అందరూ అంటారు’ అని చెప్పాడు. 

అంజలిగా ఎనర్జిటిక్‌‌‌‌ పాత్రలో  కనిపిస్తానని రుక్సర్ థిల్లాన్ చెప్పింది. మ్యాగీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ అంది క్యాతీ డేవిసన్. ఇందులో కొత్త కిరణ్ అబ్బవరంను చూస్తారని  డైరెక్టర్ విశ్వ కరుణ్ అన్నాడు. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని నిర్మాతలు రవి, రాకేష్ రెడ్డి అన్నారు.  నటుడు జాన్ విజయ్ సహా  టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.