KA Review: 'క' మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్గా ట్విస్టులు.. కిరణ్ అబ్బవరం కష్టం ఫలించిందా?

KA Review: 'క' మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్గా ట్విస్టులు.. కిరణ్ అబ్బవరం కష్టం ఫలించిందా?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క'(KA)టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుజీత్‌, సందీప్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. 

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా వస్తోన్న 'క' సినిమా.. దీపావళి కానుకగా ఇవాళ గురువారం (అక్టోబర్ 31న) థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ నుంచి రిలీజైన కాన్సెప్ట్ టీజర్, ట్రైలర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

మరి ముఖ్యంగా కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కడం.. రిలీజ్ కు ముందే చాలా కాన్ఫిడెంట్ తో కిరణ్ మాట్లాడం ఆడియన్స్ లో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం.

కథేంటంటే::

ఈ మూవీ కథంతా 1970-80 బ్యాక్‌ డ్రాప్‌ లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో అనాథ ఆశ్రమంలో పెరుగుతాడు. అక్కడే అనుకోకుండా ఎదుటి వాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఏర్పడుతుంది. ఎవ్వరూలేని తనకు.. ఆ ఉత్తరాల్లోనే తన సొంత వాళ్లు ఉన్నట్టుగా.. వారే తనకు రాసినట్టుగా ఫీల్ అవుతుంటాడు వాసుదేవ్.

అయితే ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడని మాస్టార్ గురునాథం (బలగం జయరాం) వాసును కొట్టడంతో.. ఆశ్రమం నుంచి పారిపోతాడు. ఆ తర్వాత చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఓ చిన్న ఊరు (కృష్ణగిరి)కి వెళతాడు. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే ఆ ఊర్లో కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగం చేయడం మొదలుపెడతాడు వాసుదేవ్.

ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు. అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అంతేకాకుండా వారికీ వచ్చే ఉత్తరాలను చదివి వినిపిస్తుంటాడు. అలా ఉత్తరాలు చదువుతూనే.. ఊళ్ళో జరగబోయే అనర్ధాలను ముందుగానే గుర్తించి కాపాడుతుంటాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని కోర్టు బయట హత్య కాకుండా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే అసలు ఆ ఊరి వాళ్ళు ఒక వ్యక్తిని ఎందుకు చంపాలి అనుకున్నారు. మరోవైపు ఆ ఊళ్లో అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతుంటారు. ఇలా ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు.. ఓ లెటర్ వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ ఒకటి దొరుకుతుంది. అక్కడి నుంచి వాసుదేవ్ లైఫ్ సమస్యల్లో చిక్కుకుంటుంది. మరి ఊరి అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణమెవరు? కృష్ణగిరిలోని లాలా, అబిద్ షేక్‌ల పాత్రలేంటి?

అసలు ఈ కథను ముందుకు నడిపే ఆ ముసుగు వ్యక్తి ఎవరు? చీకటి గదిలో బంధించిబడిన టీచర్‌ రాధ( తన్వి రామ్‌) ఎవరు? అసలు కృష్ణగిరిలో ఏం జరుగుతుంది? వీటన్నిటికీ సమాధానం వెతక్కడం కోసం వాసుదేవ్ ఏం చేశాడు? వంటి తదితర విషయాలకు సమాధానం దొరకాలంటే క మూవీని థియేటర్లలో చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

సస్పెన్స్ థ్రిల్లర్‌గా క చిత్రాన్ని తెరకెక్కించటంలో డైరెక్టర్లు సుజీత్, సందీప్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ వీరు ఎంచుకున్న 'క' కొత్త కాన్సెప్ట్ కథతో తీసుకురావడం. అలాగే కిరణ్ అబ్బవరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు " ‘క’ లాంటి కాన్సెప్టు ఇంత వరకూ రాలేదు.. అలా వచ్చిందని నిరూపిస్తే సినిమాలు మానేస్తా’’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎస్.. ఇది కొత్త కథగా వచ్చింది. వీరు ఎంచుకున్న పాయింట్‌లో అన్ని రకాల అంశాలుంటాయి. బ్యాక్‍డ్రాప్, కాన్సెప్ట్, క్యారెక్టర్స్ రాసుకున్న తీరు అదిరిపోయాయి.  క మూవీ ఇంటర్వెల్‍తో పాటు క్లైమాక్స్‌ చివరి 20 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు సినిమాకే హైలైట్. ముఖ్యంగా మనిషి పుట్టుక.. కర్మ ఫలం.. రుణానుబంధం.. ఈ మూడు అంశాల్ని ముడిపెట్టి ఈ ఇద్దరు డైరెక్టర్స్ ఇచ్చిన మెసేజ్.. స్టోరీని ఎండ్ చేసిన విధానం థ్రిల్లింగ్ గా ఉంటుంది.ఈ చిత్రానికి సీక్వెల్ పార్ట్-2 కూడా ఉంటుందని ఎండింగ్‍లో చూపించిన ట్విస్ట్ తో ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా చేసి సక్సెస్ అయ్యారు.

ఫస్టాఫ్ అంతా హీరో పాత్ర పరిచయం.. తన అలవాట్లు.. ఆ ఊరి సమస్యలు.. అమ్మాయిల మిస్సింగ్, వాసు-రాధల మధ్య నడిచే కథ.. ఇలా పలు అంశాలతో ఇంటర్వెల్ బ్లాక్ తో హై ఇచ్చారు. సెకండాఫ్ అంతా.. వరుసగా ట్విస్టులు రివీల్‌ చేస్తూనే.. గ్రిప్పింగ్‍గా స్క్రీన్‍ప్లే తో అమ్మాయిలు ఎలా మాయమవుతున్నారనే విషయాలను చూపించారు. ఈ క్రమంలో వచ్చే కోర్టు యాక్షన్ సీక్వెన్స్, జాతర పాట, క్లైమాక్స్ ఫైట్ మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.

అయితే.. ఈ సినిమాకు ప్రాణం అంతా కూడా చివరి 20 నిమిషాల్లోనే ఉంటుంది. అక్కడే దర్శకులుగా, రచయితలుగా సందీప్, సుజిత్‌లు తమ మార్క్ ను నిరూపించుకున్నారు. సినిమా చూసే ఆడియన్స్ కు హీరో కిరణ్ అబ్బవరం చెప్పినట్టుగా.. క్లైమాక్స్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. మొత్తానికి  క’ మూవీతో కిరణ్ అబ్బవరం బ్లాక్‍బస్టర్ హిట్ కొట్టినట్టే విషయం ఆడియన్స్ కు అర్ధమైపోయింది.

ఎవరెలా చేశారంటే::

కిరణ్ అబ్బవరం యాక్టింగ్, యాక్షన్ అదుర్స్ అనేలా చేశాడు. తనదైన పాత్రలో నటించి మెప్పించాడు.కెరీర్‌ను మలుపు తిప్పే పెర్ఫార్మన్స్ అభినయ వాసుదేవ్‌గా జీవించేసాడు. హీరోయిన్‌ నయని సారిక తెరపై చాలా అందంగా కనిపించింది. ‘ఆయ్’ వంటి సూపర్ హిట్ తర్వాత నయన్‌కి మరో మంచి రోలే దొరికింది. తన్వి రామ్‌కు ఇంపార్టెంట్ రోల్ దక్కడంతో మంచి నటనను కనబరిచింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక అంశాలు:

గ్రిప్పింగ్‍గా స్క్రీన్‍ప్లే తో డైరెక్టర్లు సుజీత్, సందీప్ ఆకట్టుకున్నారు. తాము రాసుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారు. అక్కడక్కడా కొన్ని లోటుపాట్లు ఉన్న తమదైన స్క్రీన్ ప్లేతో, ట్విస్టులతో శభాష్ అనిపించుకున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్, కథా నేపధ్యానికి ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, ‘క’ మూవీకి ప్రధాన బలం. డైరెక్టర్ రాసుకున్న సీన్స్‌కి ఓ విధంగా మ్యూజిక్ ప్రాణంగా నిలిచింది. శ్రీ వరప్రసాద్‌ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు క సినిమాను ఉన్నతంగా నిలిపాయి.