KA Movie: అరుదైన ఘ‌న‌త‌ సాధించిన ‘క’ మూవీ.. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు నామినేట్‌

KA Movie: అరుదైన ఘ‌న‌త‌ సాధించిన ‘క’ మూవీ.. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు నామినేట్‌

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క' (KA)టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు. ఇపుడీ ఈ మూవీ 15వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2025కి అధికారికంగా ఎంపికైంది.

శక్తివంతమైన కథలో భావోద్వేగాన్ని మిళితం చేసిన ఈ మూవీ ఉత్తమ చిత్రం విభాగానికి నామినేట్‌ అయినట్లు టీమ్‌ ప్రకటించింది. ''సిల్వర్ స్క్రీన్ నుండి ప్రెస్టీజియస్ స్టేజీల వరకు.. యంగ్ టీంకి ఇది నిజమైన విజయం. 'క' రాంపేజ్ కొనసాగుతోంది'' అని మేకర్స్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మే నెలాఖరున ఢిల్లీలో ఈ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో విజేతలకు పురస్కారాలు అందించనున్నారు. మరి క మూవీకి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 

దీపావళి కానుకగా 2024 అక్టోబర్ 31న విడుదలైన 'క' మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ కలెక్షన్స్తో మంచి హిట్ కొట్టాడు కిరణ్.  బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకి పైగా మైల్ స్టోన్ మార్క్ ను టచ్ చేసింది. దాంతో  కిరణ్ కెరీర్ లోనే 'క' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా అన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం సోంత బ్యాన‌ర్‌పై వ‌స్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.

కథేంటంటే::

ఈ మూవీ కథంతా 1970-80 బ్యాక్‌ డ్రాప్‌ లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో అనాథ ఆశ్రమంలో పెరుగుతాడు. అక్కడే అనుకోకుండా ఎదుటి వాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఏర్పడుతుంది. ఎవ్వరూలేని తనకు.. ఆ ఉత్తరాల్లోనే తన సొంత వాళ్లు ఉన్నట్టుగా.. వారే తనకు రాసినట్టుగా ఫీల్ అవుతుంటాడు వాసుదేవ్.

అయితే ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడని మాస్టార్ గురునాథం (బలగం జయరాం) వాసును కొట్టడంతో.. ఆశ్రమం నుంచి పారిపోతాడు. ఆ తర్వాత చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఓ చిన్న ఊరు (కృష్ణగిరి)కి వెళతాడు. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే ఆ ఊర్లో కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగం చేయడం మొదలుపెడతాడు వాసుదేవ్.

ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు. అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అంతేకాకుండా వారికీ వచ్చే ఉత్తరాలను చదివి వినిపిస్తుంటాడు. అలా ఉత్తరాలు చదువుతూనే.. ఊళ్ళో జరగబోయే అనర్ధాలను ముందుగానే గుర్తించి కాపాడుతుంటాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని కోర్టు బయట హత్య కాకుండా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మరోవైపు ఆ ఊళ్లో అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతుంటారు. ఇలా ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు.. ఓ లెటర్ వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ ఒకటి దొరుకుతుంది. అక్కడి నుంచి వాసుదేవ్ లైఫ్ సమస్యల్లో చిక్కుకుంటుంది. మరి ఊరి అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణమెవరు? కృష్ణగిరిలోని లాలా, అబిద్ షేక్‌ల పాత్రలేంటి?

అసలు ఈ కథను ముందుకు నడిపే ఆ ముసుగు వ్యక్తి ఎవరు? చీకటి గదిలో బంధించిబడిన టీచర్‌ రాధ( తన్వి రామ్‌) ఎవరు? అసలు కృష్ణగిరిలో ఏం జరుగుతుంది? వీటన్నిటికీ సమాధానం వెతక్కడం కోసం వాసుదేవ్ ఏం చేశాడు? వంటి తదితర విషయాలకు సమాధానం దొరకాలంటే క మూవీని చూడాల్సిందే.