
కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ కలిసి నిర్మించిన చిత్రం ‘దిల్ రుబా’. హోలీ సందర్భంగా మార్చి 14న సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘హే జింగిలి’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఈ జింగిలి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
భాస్కరభట్ల గారు రాసిన లిరిక్స్, సామ్ సిఎస్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి. రుక్సర్‌తో నా జోడీ బాగుందని చెబుతున్నారు. మా మధ్య లవ్ ట్రాక్ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. ఫిబ్రవరి 14నే సినిమా రిలీజ్ చేయాలనుకున్నా.. హడావుడిగా రావడం ఎందుకని పోస్ట్ పోన్ చేసుకున్నాం. వాలంటైన్స్ డే మిస్ అయినా.. హోలీని చాలా కలర్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుందాం. ‘దిల్ రుబా’ కచ్చితంగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది’ అని చెప్పాడు. ఇందులో తన పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుందని రుక్సర్ థిల్లాన్ చెప్పింది.
దర్శకుడు విశ్వ కరుణ్ మాట్లాడుతూ ‘ఈ సాంగ్ సినిమాకు చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఫస్ట్ టైమ్ లవ్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ లవ్‌ను ప్రపోజ్ చేయడానికి పడే భయంతో ఈ సాంగ్ సాగుతుంది’ అని అన్నాడు. ‘మాది పాన్ ఇండియా రిలీజ్ మూవీ కాకపోయినా పాన్ ఇండియా ప్రొడక్షన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’ అని నిర్మాత రవి తెలియజేశారు.