బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే!

దేశంలో బీసీల రిజర్వేషన్ల పెంపు డిమాండ్ పెరుగుతున్నది. ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అనుకూలమైన నిర్ణయం రావడంతో ఓబీసీల్లో మరింత అలజడి మొదలైంది.15 % ఉన్న ఎస్సీలకు 15 % రిజర్వేషన్లు, 7.5 % ఉన్న ఎస్టీలకు 7.5 % రిజర్వేషన్ ఉంటే,10 % కూడా లేని అగ్రకుల పేదలకు10 % రిజర్వేషన్ ఇస్తే 52 శాతం ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వడం సామాజిక న్యాయం ఎలా అవుతుందని బీసీలు ప్రభుత్వాలను నిలదీస్తున్నాయి. తమిళనాడులో ఎప్పటినుంచో ఎంబీసీలకు 20 %, ఓబీసీలకు 30 %, మొత్తం మీద 50 % రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అక్కడ అన్ని రిజర్వేషన్లు కలిపితే 69 శాతం చేరుతుంది. ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వం ఎస్సీలకు12 శాతం, ఎస్టీలకు 28% అత్యంత వెనుకబడిన కులాలకు15 %,  వెనుకబడిన కులాలకు12 శాతం ఈడబ్ల్యూఎస్ వాళ్లకి 10 % రిజర్వేషన్లను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద 77% రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఈ వారంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను ఏకంగా 76 శాతానికి పెంచింది. ఓబీసీలకు 27 %, ఎస్సీలకు 13 శాతం, ఎస్టీలకు 32 శాతం, ఈడబ్ల్యూఎస్ కు 4 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్​నిర్ణయం తీసుకుంది. మరి 56 % బీసీలు ఉండే తెలంగాణలో రిజర్వేషన్లను ఎప్పుడు పెంచుతారని బీసీ కులాలు ప్రశ్నిస్తున్నాయి. 

తమిళనాడులో సామాజిక న్యాయం

1992 నాటి ఇందిరా సాహ్నీ కేసులో దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం ఓబీసీ రిజర్వేషన్లు ఇస్తూనే రిజర్వేషన్లు 50 % పెంచకూడదని చెప్పడంతో ఓబీసీలకు తీరని అన్యాయం జరిగింది. ఓబీసీ రిజర్వేషన్లు దేశంలో అమలు కావడానికి చాలా రోజులే పట్టింది. మండల కమిషన్ రిపోర్ట్ ను1980లో సమర్పిస్తే వీపీ సింగ్​ ప్రభుత్వం1990లో అమలు చేసింది. సుప్రీంకోర్టులో కేసు వేయడంతో1992 వరకు ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదు. 9 నవంబర్ 1993లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్లాసెస్, షెడ్యూల్ ట్రైబ్స్ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. న్యాయస్థానంలో అడ్డంకులు రావడంతో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి 67వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొమ్మిదో షెడ్యూల్​లో ఆర్టికల్ 257 ఏ కింద తమిళనాడు రిజర్వేషన్లు పెట్టి న్యాయస్థానాల జోక్యం లేకుండా చేశారు. ఈ నిర్ణయంతో తమిళనాడులో సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధికి పునాదులు పడ్డాయి. బీసీలకు న్యాయం చేయాలన్న తపన ఉంటే ఏ శక్తీ కూడా అలాంటి నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయదని చెప్పడానికి తమిళనాడే ఉదాహరణ.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీలు సంఘటితమై కనీసం 50 నుంచి 56 % రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలి. తెలంగాణలో ఇప్పటికే  బీఎస్పీ బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. బీజేపీ ఏమో రాష్ట్రాలు బీసీ జాబితాను చేసుకునే హక్కు ఉందని చెప్తూ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అడ్డుకోమని అంటున్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వారి స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేయలేదు. బహుశా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తే ఆ పార్టీకి కూడా ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. ఈ తరుణంలో జాతీయ స్థాయిలో రాజకీయాలను మొదలు పెట్టాలని చూస్తున్న టీఆర్ఎస్ పార్టీ బీసీలకు 52 శాతం రిజర్వేషన్ ఇచ్చి తొమ్మిదో షెడ్యూల్​లో పెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే బీసీలకు మేలు జరుగుతుంది. ఏపీలో వైఎస్సార్సీపీ బీసీలకు 50 % రిజర్వేషన్లు కల్పిస్తే టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉన్నది. పార్టీల వైఖరి ఇప్పుడు ఎలా ఉన్నా.. బీసీలు రిజర్వేషన్ల కోసం ధర్మపోరాటం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. - జి. కిరణ్ కుమార్, జాతీయ అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్