- షా ట్వీట్ తో పింక్ ట్యాక్స్ పై జోరుగా చర్చలు
- పురుషులు, మహిళలు వాడే సేమ్ ప్రొడక్ట్ పై వేర్వేరు ధరలా?
- మహిళలకు జీతాలు తక్కువ.. ప్రొడక్టులకు రేట్లు మాత్రం ఎక్కువా?
- ప్రొడక్టుల రేట్లలోనూ లింగ వివక్ష ఏందంటూ నెటిజన్ల ఫైర్
హైదరాబాద్, వెలుగు: పింక్ ట్యాక్స్.. దీని గురించి చాలా మంది విని ఉండరు. కానీ, ఇప్పుడది హాట్ టాపిక్ అయింది. ప్రముఖ ఫార్మా సంస్థ బయోకాన్ చైర్పర్సన్కిరణ్ మజుందార్ షా చేసిన కామెంట్స్‌తో ఆ ట్యాక్స్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పింక్ ట్యాక్స్ ప్రొడక్టులను అసలు మహిళలు ఎందుకు వాడాలంటూ ఆమె నెట్టింట చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ‘‘పింక్ ట్యాక్స్! లింగ వివక్షలో ఇదో రకం. వివక్షాపూరితంగా పింక్ ట్యాక్స్ పిండేస్తున్న ఉత్పత్తులను మహిళలందరూ బ్యాన్ చేయాలి’’ అని పేర్కొంటూ ఆమె బుధవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి వివిధ ప్రొడక్టుల పింక్ ట్యాక్స్‌కు సంబంధించిన ఓ వీడియోను జోడించారు.
అసలేంటీ పింక్ ట్యాక్స్?
పేరులో ట్యాక్స్ ఉన్నా.. ఇదేమీ నిజమైన పన్ను కాదు. ప్రభుత్వమూ వేయదు. ఇది వివిధ ఉత్పత్తులపై సదరు సంస్థలు విధించే ధరే. మార్కెట్లో మగవారికి, ఆడవారికి వివిధ రకాల ఉత్పత్తులుంటాయి కదా. అంటే ఒకే రకమైన ప్రొడక్ట్‌ను మహిళలకు, పురుషులకు అని కేటగిరీ ఇచ్చి సంస్థలు వేర్వేరుగా అమ్ముతుంటాయి. అయితే, ధరను మాత్రం మహిళల ఉత్పత్తులకు ఎక్కువగా, పురుషుల ఉత్పత్తులకు మాత్రం తక్కువగా పేర్కొంటున్నాయి. ఇదిగో సేమ్ ప్రొడక్ట్, సేమ్ క్వాంటిటీకి సేమ్ ధరను పెట్టకుండా.. మహిళల ప్రొడక్టులకు సంస్థలు ఎక్కువ ధర పెట్టడాన్నే ‘పింక్ ట్యాక్స్’ అంటున్నారు. అయితే, కిరణ్ మజుందార్ షా లేవనెత్తిన ఈ పింక్ ట్యాక్స్‌పై భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ధరల్లో లింగ వివక్ష ఇలా..
ఓ కంపెనీ పురుషులకు, మహిళలకు ఒకే లిప్ బామ్ ను తయారు చేసింది. ప్రొడక్ట్, క్వాంటిటీ సమానంగా ఉన్నా.. రెండింటికీ వేర్వేరు ధరలు పెట్టింది ఆ కంపెనీ. మహిళల లిప్ బామ్ రేటు రూ.250 పెడితే.. మగవారి లిప్‌బామ్‌కు మాత్రం కేవలం రూ.165 ధరకే అమ్ముతున్నది. మరో సంస్థ మగవారి షేవింగ్ బ్లేడ్‌ను రూ.70కి అమ్మితే.. మహిళల బ్లేడ్‌ను రూ.80కి అమ్ముతున్నది. ఇంకో సంస్థ 45 ఎంఎల్ రోల్ ఆన్ డియోను మహిళలకు రూ.115కి ధర ఫిక్స్ చేస్తే.. మగవాళ్ల డియోకు కేవలం రూ.105 చార్జ్ చేస్తున్నది. మరో బ్రాండ్ మహిళల తెలుపు రంగు టీ షర్ట్‌ను రూ.599కి అమ్మితే.. మగవారి టీషర్ట్‌ను మాత్రం రూ.299కే అమ్ముతున్నది. ఇక ఓ సెలూన్లో మామూలు హెయిర్‌కట్‌కు మగవారికైతే రూ.400.. మహిళలకైతే రూ.800గా ధర ఫిక్స్ చేశారు. ఇట్ల ఒక్కటి, రెండు కాదు.. చాలా విషయాల్లో మహిళలు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటున్నది. అందుకే సేమ్ ప్రొడక్ట్.. సేమ్ క్వాంటిటీకి పురుషుల కన్నా మహిళలు ఎందుకు ఎక్కువ చెల్లించాలన్న ప్రశ్నలు వస్తున్నాయి.
జీతాలు మాత్రం ఎక్కువియ్యరా..
పింక్ ట్యాక్స్‌పై చర్చల్లో కొందరు మహిళల జీతాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ప్రొడక్టులపై ఎక్కువ ధరలు పెడుతున్నా.. వర్క్ప్లేసెస్లో పురుషులతో పోలిస్తే మహిళల జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. ఉద్యోగాల్లో లింగ సమానత్వం చూపించట్లేదన్న వాదనలు వినిపిస్తున్నారు. సేమ్ ఉద్యోగం చేసే మహిళలు, పురుషుల జీతాల్లో తేడా ఉంటోందని అంటున్నారు. మగవారికన్నా మహిళలకు సగటున15 శాతం తక్కువ జీతం ఇస్తున్నారన్న చర్చ నడుస్తున్నది. అటు ఉద్యోగాల్లో సమాన వేతనాలు లేకపోవడంతోపాటు ఇటు వాడే ఉత్పత్తులపైనా సమాన ధరలు లేకపోతే ఇక లింగ సమానత్వం ఎలా సాధ్యమవుతుందని అంటున్నారు. మహిళలకు జీతాలు తక్కువగా ఉండి.. వాళ్లు వాడే వస్తువులపై ధరలు మాత్రం ఎక్కువగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.