
- దేశంలో 8.72 లక్షల వక్ఫ్ ప్రాపర్టీలున్నయ్
- లోక్ సభలో వక్ఫ్(సవరణ) బిల్లు, 2025ను ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి
- అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చలు
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు 2025పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర న్యాయ, మైనార్టీ వ్యవహారాల శాఖల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి ఇప్పుడు సవరణలు తీసుకురాకపోయి ఉంటే.. పార్లమెంట్ బిల్డింగ్ ను కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకుంటారని ఫైర్ అయ్యారు. బుధవారం లోక్ సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ చట్టాలకు అభ్యంతరకరమైన మార్పులు చేసింది. 123 కీలక ఆస్తులను డీనోటిఫై చేసి, వక్ఫ్ కు అప్పగించడం అందులో ఒకటి. మేం అడ్డుకోకపోయి ఉంటే.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు పార్లమెంట్ బిల్డింగ్‌ను కూడా వక్ఫ్‌కు కట్టబెట్టేది” అని ప్రతిపక్ష పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘‘ఢిల్లీలో పార్లమెంట్ బిల్డింగ్‌తో సహా అనేక ప్రాపర్టీలకు సంబంధించి 1970 నుంచీ ఓ కేసు నడుస్తోంది. ఆ ఆస్తులన్నీ తమవేనని ఢిల్లీ వక్ఫ్‌బోర్డు క్లెయిమ్ చేసుకుంది. అయితే, ఆ కేసు కోర్టులో ఉండగానే.. గత యూపీఏ సర్కారు సంబంధిత 123 ప్రాపర్టీలను డీనోటిఫై చేసి వక్ఫ్‌కు కట్టబెట్టింది” అని రిజిజు చెప్పారు. ‘‘ఒకవేళ ఈ రోజు మేం ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టకపోయి ఉంటే.. మనం కూర్చున్న ఈ బిల్డింగ్‌ను సైతం వక్ఫ్ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకునేవారు. ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి రాకపోయి ఉంటే.. ఇతర ప్రాపర్టీలు సైతం డీనోటిఫై అయ్యేవి” అని కేంద్ర మంత్రి అన్నారు.
ఆస్తుల నిర్వహణ కోసమే బిల్లు..
వక్ఫ్ బిల్లులో కేంద్రం చేసిన సవరణలు కేవలం ప్రాపర్టీ మేనేజ్మెంట్ కు సంబంధించినవేనని, మసీదుల నిర్వహణకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ‘‘మతపరమైన సెంటిమెంట్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. వక్ఫ్ బోర్డు ఉన్నది కేవలం వక్ఫ్ ఆస్తులను నిర్వహించడానికి, పాలన, పర్యవేక్షణకు ఉద్దేశించినది మాత్రమేనని బిల్లులో ప్రతిపాదించాం” అని ఆయన తెలిపారు. ఈ కనీస తేడాను అర్థం చేసుకోకుండా, బిల్లును వ్యతిరేకించాలని అనుకునేవాళ్లకు తన దగ్గర ఎలాంటి సమాధానం లేదన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సిఫార్సుల మేరకే బిల్లును రీడ్రాఫ్ట్ చేశామన్నారు. భారత దేశ చరిత్రలోనే అతి సుదీర్ఘంగా కసరత్తు చేసిన జేపీసీ ఇదేనన్నారు.
టెంపుల్స్, గురుద్వారాలనూ ‘వక్ఫ్’ అన్నరు..
ఏ భూమినైనా వక్ఫ్ ప్రాపర్టీగా బోర్డు ప్రకటించవచ్చని ప్రస్తుత వక్ఫ్ చట్టాల్లో ఉన్న దారుణమైన ‘సెక్షన్ 40’నే తాము తొలగించామని రిజిజు తేల్చిచెప్పారు. ఇప్పటివరకూ ఈ నిబంధనను దుర్వినియోగం చేసి వక్ఫ్ ఆస్తులను లక్షల సంఖ్యకు పెంచుకున్నారని అన్నారు. ‘‘టెంపుల్స్, గురుద్వారాలను కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించుకున్నారు. అక్కడ అంతకుముందు మసీదులు ఉన్నట్టుగా ఎలాంటి రికార్డులు లేకపోయినా వాటిని వక్ఫ్ బోర్డుకు ధారాదత్తం చేశారు. తమిళనాడులో సురేందరేశ్వర్ టెంపుల్, హర్యానాలో సిక్కు గురుద్వారాను, కర్నాటకలో వేలాది ఎకరాల భూములను, కేరళలో 600 కుటుంబాలకు చెందిన భూములను, సైతం వక్ఫ్ ప్రాపర్టీలుగా డిక్లేర్ చేశారు” అని ఆయన వెల్లడించారు.
వక్ఫ్ వద్దే అత్యధిక భూములు..
దేశంలో రైల్వే శాఖ, రక్షణ శాఖల తర్వాత వక్ఫ్ బోర్డ్ వద్దే అత్యధికంగా 8.72 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయని రిజిజు తెలిపారు. వాటిని సరిగ్గా నిర్వహించి ఉంటే ముస్లింల జీవితాలు మాత్రమే కాదు.. మొత్తం దేశమే మారిపోయి ఉండేదన్నారు. ప్రతిపక్షాలు వక్ఫ్ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.
వక్ఫ్ ఆస్తులపై రూ. 12 వేల కోట్ల ఆదాయం..
వక్ఫ్ బోర్డు వద్ద ద్దమొత్తంలో భూములు ఉన్నా.. 70 ఏండ్లుగా పేద, సామాన్య ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వంచనకు గురి చేశారని రిజిజు మండిపడ్డారు. ఈ ఆస్తులను పేద ముస్లింల కోసం ఎందుకు వినియోగించలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘వక్ఫ్ఆస్తుల విలువను బట్టి చూస్తే.. వాటిపై కనీసం రూ. 12,000 కోట్ల ఆదాయం రావాలి” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఒవైసీ వర్సెస్ జగదంబికా పాల్
సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్‌కు జేపీసీ చీఫ్, బీజేపీ ఎంపీ జగదంబికా పాల్‌కు మధ్య మాటల యుద్ధం సాగింది. ముందుగా ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలపై దాడి. నా స్వేచ్ఛపై మోదీ ప్రభుత్వం యుద్ధం మొదలుపెట్టింది. నా మసీదులు, నా దర్గాలు, నా మదర్సాలను టార్గెట్ చేస్తోంది. ఈ బిల్లు ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోంది. వక్ఫ్ బోర్డును నాన్ ముస్లిం నడిపిస్తారు. అందుకే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తు న్నా” అని ఆయన స్పష్టం చేశారు. తాను బిల్లు పేపర్లను చింపేస్తానని, వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చాటుతానని.. ఒవైసీ తన చేతిలోని బిల్లు కాగితాలను చింపేశారు. అనంతరం జగదంబికా పాల్ మాట్లాడుతూ.. బిల్లు పేపర్లను ఒవైసీ చింపడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.