
న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశమైన వక్ఫ్ బిల్లు బుధవారం (ఏప్రిల్ 2) లోక్‌సభ ముందుకు రానుంది. క్వశ్చన్ అవర్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును సభలో మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టనున్నారు. ఎనిమిది గంటలపాటు చర్చించనున్నారు. అనంతరం సభ ఆమోదం కోసం స్పీకర్ ఓటింగ్ నిర్వహించనున్నారు.
వరుస సెలవుల అనంతరం మంగళవారం పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగా.. శుక్రవారంతో ముగియనున్నాయి. వక్ఫ్ బిల్లును ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి వ్యతిరేకిస్తున్నది. ముస్లింల హక్కులను కాలరేసేలా బిల్లు ఉందని అంటున్నది. కావాలనే ఇండియా కూటమి తప్పుడు ప్రచారం చేస్తున్నదని, ప్రతిపక్షాలు కోరిక మేరకు ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి బిల్లును పంపామని, అక్కడ చర్చలు కూడా ముగిశాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం మీడియాతో అన్నారు.
బిల్లుపై ఎనిమిది గంటలు చర్చించాలని స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) మీటింగ్‌లో నిర్ణయించామని.. అవసరమైతే ఆ సమయాన్ని ఇంకింత పొడిగించేందుకు సిద్ధమని తెలిపారు. కాగా.. బీఏసీ మీటింగ్‌లోనే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కీలకమైన ఈ బిల్లుపై చర్చకు ఎక్కువ టైమివ్వాలని కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని పార్టీలు డిమాండ్ చేశాయి.
ప్రతిపక్షాల గొంతును అధికార పక్షం అణచివేయాలని చూస్తున్నదని.. మణిపూర్, ఎలక్టోర్ ఫొటో ఐడెంటిటీ కార్డులు వంటి అంశాలపై చర్చించాలని తాము పెట్టిన ప్రతిపాదలను బీఏసీలో పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. బీఏసీ మీటింగ్ మధ్యలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. వక్ఫ్ బిల్లుపై మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఇది ముస్లింల మత స్వేచ్ఛను హరించేలా ఉందన్నారు. బీజేపీతోపాటు దాని మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ తదితర పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
ఆమోదం పొందేనా?
వక్ఫ్ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకిస్తున్నది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 272 మంది సభ్యుల సాధారణ మెజార్టీ అవసరం. బీజేపీకి సొంతగా 240మంది సభ్యులు ఉన్నారు. దాని మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ వంటి పలు పార్టీల బలంతో కలిపి 293గా ఉంది. సభకు తప్పకుండా హాజరుకావాలని, ఓటింగ్‌లో పాల్గొనాలని పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. మిత్రపక్షాల మద్దతు బీజేపీకి లభిస్తే వక్ఫ్ బిల్లు లోక్‌సభలో గట్టెక్కుతుంది. ప్రతిపక్షాలు మాత్రం బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. లోక్‌సభలో ఆమోదం అనంతరం రాజ్యసభకు ఈ బిల్లు వెళ్లనుంది. అక్కడ కూడా చర్చించి
ఆమోదం పొందాకే చట్టరూపం దాలుస్తుంది.