కష్టపడి సంపాదించే మొత్తంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచించేదే. కానీ పెరుగుతున్న ఖర్చులు, పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు అంటూ ఒకటిపోతే మరొకటి వస్తూనే ఉంటాయి. వీటన్నింటినీ అధిగమించి మీరు నాలుగు రాళ్లు వెనకేసుకొవాలనుకుంటే.. అద్భుతమైన రాబడినిచ్చే ప్రభుత్వ పథకం ఒకటుంది. ఇందులో మీరు పెట్టే పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఏంటి ఈ పథకం..? ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు..? వంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
పెట్టుబడిని రెట్టింపు చేస్తుంది..
ఈ పథకం పేరు.. కిసాన్ వికాస్ పత్ర (KVP). రిస్క్ లేని అధిక రాబడినిచ్చే సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది. ఇందులో నిర్ణీత మెుత్తంలో ఒకసారి పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. ఇందులో మీ పొదుపు కేవలం 115 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. కనీస పెట్టుబడి 1,000 రూపాయలు. గరిష్ట పరిమితి అంటూ లేదు. పొదుపు చేయాలకునేవారు తమకు కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు.
10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఈ వయసులో పొదుపు చేస్తే.. అది వారి పైచదువులకు ఉపయోగపడుతుంది. కిసాన్ వికాస్ పత్రలో త్రైమాసికానికి కలిపి 7.5 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తుంది. వడ్డీ వార్షికంగా లెక్కించబడుతుంది.
రూ. 5 లక్షలు రూ. 10 లక్షలు ఎలా..?
ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే.. 115 నెలల కాలానికి 7.5 శాతం చక్రవడ్డీతో మీ పెట్టుబడి రూ.10 లక్షలు అవుతుంది. ఎవరైనా వ్యక్తి తనకు పెద్ద మెుత్తంలో డబ్బు వచ్చినప్పుడు దానిని రెట్టింపు చేసుకునేందుకు ఈ స్కీమ్ వైపు చూడవచ్చు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కింద ఒకరు లేదా ఉమ్మడి ఖాతా తెరవవచ్చు. ముగ్గురు వ్యక్తుల వరకు జాయింట్ ఖాతా తెరవవచ్చు. ఖాతా తెరిచేటప్పుడు నామినీ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకవేళ పెట్టుబడిదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే నామినీకి రాబడి చెల్లిస్తారు. ఈ పథకం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే.. దగ్గరలోని పోస్టాఫీస్‌ను సంప్రదించండి.