కేసీఆర్ తో పొత్తు లేదు.. పోరాటమే : కిషన్ రెడ్డి

కేసీఆర్ తో పొత్తు లేదు.. పోరాటమే : కిషన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తో పొత్తులు లేవని.. తెలంగాణ రాష్ట్రంలో నయా నిజాం తరహా, కుటుంబ పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పాతరేస్తామన్నారు. అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇచ్చిన హామీల నుంచి నైతికంగా రాజకీయాలు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే కంకణం కట్టుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేసీఆర్ కుటుంబాన్ని ఫాంహౌజ్ కు పరిమితం చేస్తామన్నారు. జులై 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ కు వస్తున్న సందర్భంగా కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని చెప్పారు. రైల్వే మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్ కు భూమిపూజ చేస్తారని తెలిపారు. 

కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..? 

‘‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. దళితులకు వెన్నుపోటు పొడిచి.. ముఖ్యమంత్రి సీటులో కూర్చొని.. మొదటి రోజు నుంచే మోసం చేస్తున్నారు. బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీ పెడుతామని 2018లో చెప్పి..  ఇప్పటి వరకూ దానిపై స్పష్టత లేదు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చేయలేదు. ప్రతి మండలానికి ఒక ఆస్పత్రి కడుతానని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని చెప్పి.. అమలు చేయలేదు. ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, హైదరాబాద్ నలుదిక్కులా నిమ్స్ తరహాలాంటి ఆస్పత్రులు కడుతామని చెప్పి.. అమలు చేయలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాని చెప్పి.. చేయలేదు. 40 లక్షలమంది విద్యార్థులకు కేజీ టు పీజీ విద్యనందిస్తామన్నారు. గిరిజన బంధు ఎక్కడపోయింది..? దళితబంధు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు కమీషన్లు తీసుకోవడానికి పరిమితమైంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పారు’’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

‘‘దశాబ్ది ఉత్సవాలను ఎవరి కోసం నిర్వహించారు. కల్వకుంట్ల కుటుంబానికి..? తెలంగాణ ప్రజలకు చేశారా..? కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణ అయ్యిందా..? తెలంగాణ సమాజం బంగారు తెలంగాణ అయ్యిందా..?. ఈ విషయంపై కేసీఆర్ సమాధానం  చెప్పాలి. దశాబ్ది ఉత్సవాల పేరిట 21 రోజుల పాటు పూర్తిగా అబద్దాలు ప్రచారం చేసి, వందల కోట్లు ఖర్చు పెట్టారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారు. నిధులు కూడా విడుదల చేయడం లేదు. సర్పంచులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. 

కేంద్రం ఇచ్చిన ఇండ్లకు కూడా ఇప్పటి వరకూ అతీగతీ లేదన్నారు కిషన్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పార్టీ ఆఫీసులకు స్థలాలు కేటాయిస్తారు గానీ.. పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వడానికి స్థలం ఉండదా..? అని ప్రశ్నించారు. జీవో జారీ చేసి కంటోన్మెంట్ లో ఉన్న ఓ ల్యాండ్ ను (కోర్టు పరిధిలో ఉన్న భూమి)  కాంగ్రెస్ కు  కేటాయించిందని, ఆ జీవో ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీకి కూడా ల్యాండ్ కేటాయించిందన్నారు. సైన్స్ సిటీ ఏర్పాటు చేసేందుకు 25 ఎకరాల స్థలం ఇవ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.

వరంగల్ లో సైనిక్ స్కూలును అటకెక్కించారని ఆరోపించారు కిషన్ రెడ్డి. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. మెట్రోరైలును ఫలక్ నామా వరకు కొనసాగించాలని, కానీ.. అఫ్జల్ గంజ్ వరకు వేసి, ఆ తర్వాత ఆపేసి కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. పాతబస్తీ ప్రజలు మెట్రోట్రైన్ కు నోచుకోకుడదా..? అని ప్రశ్నించారు. రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి భూములు ఇవ్వని కారణంగా చాలా రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయని చెప్పారు. ఏడేళ్లుగా ఎంఎంటీఎస్ ఆపేస్తే కేంద్రమే నిధులు భరించి పూర్తి చేసిందన్నారు. వరంగల్ కు టెక్ట్స్ టైల్ పార్క్ ఇస్తే ఇప్పటి వరకు కేంద్రంతో ఒప్పందం చేసుకోలేదన్నారు. తెలంగాణకు ఎంతో ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్డును కేంద్ర ప్రభుత్వం నిర్మించడానికి ముందుకు వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకుండా.. 50శాతం నిధులు విడుదల చేయడం లేదన్నారు.