అల్లూరికి జాతీయ స్థాయి  గౌరవం దక్కాలి

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలలోనే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కలసి రావడం తెలుగు వారికి ఎంతో సంతోషకరమైన విషయం.  అయితే చరిత్ర పుస్తకాలలో మాత్రం ఆ మహనీయుడికి సరైన స్థానం కల్పించడంలో కొంత లోపం జరిగింది. దేశం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాలూ, రక్తతర్పణల దగ్గర పక్షపాతం, అలక్ష్యం ఉండరాదన్నది ఆజాదీ కా అమృతోత్సవ్‌‌‌‌ ఆశయాలలో ఒకటి. ఆ ఉద్దేశంతోనే ఇటీవల 1899–1900లో రాంచీ ప్రాంతంలో మహోన్నత గిరిజనోద్యమం నిర్వహించిన బీర్సా ముండాకు సముచిత గౌరవం కల్పించుకున్నాం. అలాంటి గౌరవం అల్లూరి సీతా రామరాజుకూ దక్కాలి. బీర్సా నడిపిందీ, రామరాజు నడిపిందీ గిరిజనోద్యమాలే. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించినప్పుడే భారత స్వరాజ్య సమర చరిత్ర నిర్మాణానికి పరిపూర్ణత వస్తుంది. 

స్వాతంత్ర పోరాటంలో ఎంతో చరిత్ర ఉన్న భారతీయ గిరిజనోద్యమాలలో కీలకమైనది తూర్పు కనుమలలో జరిగిన విశాఖ మన్య విప్లవం. ఈ విప్లవ నాయకుడు అల్లూరీ రామరాజు. జూలై 4, 1897న రామరాజు ప్రస్థుత పాత విశాఖ జిల్లా భీమునిపట్నానికి సమీపంలోని పాండ్రంగిలో అమ్మమ్మగారింట జన్మించారు. వెంకటరామరాజు, శ్రీమతి సూర్యనారాయణమ్మ దంపతుల తొలి సంతానం రామరాజు. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. నాలుగో ఏడు వచ్చే వరకే ఆయన అక్కడ పెరిగారు. వెంకటరామరాజు వృత్తి రిత్యా ఫోటోలు తీసేవారు. కొవ్వాడ, నరసాపురం టేలర్‌‌‌‌ ‌‌‌‌స్కూల్‌‌‌‌, ‌‌‌‌రామచంద్రపురం, విశాఖ ఏవీఎన్‌‌‌‌ ‌‌‌‌విద్యాసంస్థ, తునిలలో రామరాజు విద్యాభ్యాసం సాగింది. ఇంగ్లిష్‌‌‌‌ ‌‌‌‌చదువు మీద ఆసక్తి లేని రామరాజుకి సంస్కృతం పట్ల ఆసక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఏదైనా ఉద్యోగం చేయమని సలహా ఇచ్చిన తల్లితో సరేనని చెప్పి, ఉత్తర భారతమంతా తిరిగి, హరిద్వార్‌‌‌‌ చేరాడు. స్వాతంత్రోద్యమం ఊపిరి పోసుకుంటున్న సమయంలో  రామరాజుకి ఈ పర్యటన తన కొత్త మలుపు తీసుకొచ్చింది. 
 

ఉద్యమానికి ఊపిరి
జులై 24, 1917న రామరాజు పర్యటనలో భాగంగా కృష్ణదేవిపేట జిల్లాకు చేరుకున్నాడు. అల్లూరి ఉద్యమ జీవితానికి ఊపిరి పోసింది ఈ గ్రామం. విశాఖ జిల్లా మన్యానికి గుమ్మం వంటిది. రామరాజుకు ఊరి పెద్ద చిటికెల భాస్కరనాయుడు  ఆశ్రయం ఇచ్చాడు. అక్కడ జరుగుతున్న బ్రిటిషువారి అరాచకాలతో ఆయనకు ఆయుధం  చేపట్టాల్సి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది.  ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఆనాటి  ‌‌‌‌ప్రభుత్వం రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించింది.  గూడెం ప్రాంతంలో ఇంచార్జిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌ అల్ఫ్ ‌‌‌‌బాస్టియన్‌‌‌‌ ‌‌‌‌బినామీ పేర్లతో రోడ్డు పనుల కాంట్రాక్టు తీసుకుని, గిరిజనులను బెదిరించి రోడ్డు పనికి రప్పించేవాడు. వారికి కూలి ఇవ్వకుండా బయపెట్టి వేధించేవాడు. అప్పుడు కొంతమంది అడవి బిడ్డలు 1922 జనవరిలో రామరాజు దగ్గరకు వచ్చి గోడు వినిపించుకున్నారు. దాంతో రామరాజు బాస్టియన్‌‌‌‌ ‌‌‌‌మీద పై అధికారులకు ఫిర్యాదు రాశారు. ఫలితంగా- రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడని ఆరోపించి జనవరి 29న ఏజెన్సీ కమిషనర్‌‌‌‌ ‌‌‌‌స్వెయిన్‌‌‌‌ ‌‌‌‌రామరాజును పిలిపించి స్వయంగా విచారించాడు. అదే సమయంలో గాంధీజీ   సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు  ప్రకటించారు. ఫిబ్రవరి 3న  బ్రిటిష్ ప్రభుత్వం రామరాజును పొలిటికల్‌‌‌‌ ‌‌‌‌సస్పెక్ట్‌‌‌‌గా చిత్రీకరించి అరెస్టు చేసి నర్సీపట్నం జైలులో పదహారు రోజులు ఉంచి, తరువాత పోలవరం డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌ ‌‌‌‌ఫజులుల్లా రామరాజుకు పైడిపుట్ట వద్ద 50 ఎకరాల పొలం ఇచ్చి, దుచ్చెర్తి ముఠాదారు చెక్కా లింగన్న దొర అజమాయిషీలో ఉంచారు. అక్కడ నుంచే నేపాల్‌‌‌‌ ‌‌‌‌యాత్ర పేరిట అనుమతి తీసుకుని బయటకు వచ్చి మన్యంలో ఉద్యమ నిర్మాణాని కి శ్రీకారం చుట్టాడు. 
 

మొదటి దాడి..
ఆగస్ట్ 22, 1922‌‌‌‌న పట్టపగలు  రామరాజు నాయకత్వంలో మూడు వందల గిరిజనుల దండు మొదట చింతపల్లి పోలీస్‌‌‌‌ ‌‌‌‌స్టేషన్‌‌‌‌ ‌‌‌‌మీద దాడి చేసింది. అక్కడ పోలీస్‌ స్టేషన్​లో 11 తుపాకులు ఇతర ఆయుధ సామాగ్రి తీసుకువెళుతున్నానని  అధికారులకు లేఖ రాసి మరీ వెళ్లాడు రామరాజు. అలా పోలీస్‌ స్టేషన్లపై దాడి చేస్తూ వందలాది తూటాలు, బాయ్‌‌‌‌నెట్లు, యూనిఫారాలు కూడా రామరాజు దళం స్వాధీనం చేసుకుంది. వరుసగా పోలీసు స్టేషన్ల మీద దాడి చేయడంతోనే మద్రాస్‌‌‌‌ ‌‌‌‌ప్రెసెడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్‌‌‌‌ఎ ‌‌‌‌గ్రాహమ్‌‌‌‌కు టెలిగ్రామ్‌‌‌‌లు వెళ్లాయి. అప్పుడే జైపూర్‌‌‌‌ ‌‌‌‌మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని కూడా రామరాజుదళం వశం చేసుకుంది. మూడు పోలీస్‌‌‌‌ ‌‌‌‌స్టేషన్ల మీద దక్కిన విజయం కంటే  దామనపల్లి అనే కొండమార్గంలో సెప్టెంబర్‌‌‌‌ 24, 1922‌‌‌‌న  రామరాజుకు దక్కిన విజయం చరిత్రాత్మకమైనది. రామరాజు ఉద్యమాన్ని అణచడం స్థానిక పోలీసుల వల్ల కాలేదు. 
 

చెట్టుకి కట్టి కాల్చి చంపిండు
రామరాజు నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేయడంలో స్థానిక పోలీసులు, మలబారు దళం కూడా విఫలమై,  1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌‌‌‌ను రంగంలోకి దించారు. మన్యం ప్రాంతాలలో బ్రిటిషు పోలీసు హింసతో, అత్యాచారాలతో, అకృత్యాలతో అడవి బిడ్డలు తల్లడిల్లిపోయారు. అదే ఏడు  మే లో రేవుల కంతారం అనేచోట రామరాజు దళం సమావేశమైంది. ఆ సమావేశం జరుగుతూ ఉండగానే పోలీసులు దాడి చేశారు. ఆ దాడి నుండి తప్పించుకున్నా, ఆ మరుసటి రోజే ఈస్ట్‌‌‌‌కోస్ట్ ‌‌‌‌దళానికి చెందిన కంచుమేనన్‌‌‌‌, ఇం‌‌‌‌టెలిజెన్స్  ‌‌‌‌పెట్రోలింగ్‌‌‌‌ ‌‌‌‌సబ్‌‌‌‌ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ ఆళ్వార్‌‌‌‌నాయుడు బలగంతో చుట్టుముట్టి  రామరాజుని అరెస్టు చేశారు.  అరెస్టు చేసిన రాజును ఒక నులక మంచానికి కట్టి, గిరిజనుల చేతనే మోయిస్తూ కృష్ణదేవిపేటకు తీసుకెళుతూ, దారిలో ఉన్న కొయ్యూరు దగ్గర మేజర్‌‌‌‌ ‌‌‌‌గుడాల్‌‌‌‌ ‌‌‌‌రామరాజును కట్టిన మంచాన్ని బలవంతంగా దింపి మాట్లాడతానని గుడారంలోకి తీసుకువెళ్లాడు. అక్కడే ఇద్దరికీ గొడవ జరగడంతో కోపంతో గుడాల్‌ రామరాజును ఒక చెట్టుకు కట్టి  కాల్చి చంపేశాడు. చివరికి రాజు ఎక్కడైతే ఉద్యమకారునిగా రూపొందాడో ఆ కృష్ణదేవిపేటలోనే తాండవ ఒడ్డున అంత్యక్రియలు జరిపారు. 
 

గిరిజనుల హక్కుల కోసమే ఉద్యమాలు..
మన్యవాసులలో సంస్కరణలు తెచ్చి, వారిలో అక్షరాస్యతకు ప్రయత్నిస్తూ గిరిజనుల మధ్య వున్న సమస్యల పరిష్కారానికై  పంచాయతీలు నిర్వహించడం, వారిలో ఐక్యతకు విశేష కృషి చేయడంతో  రామరాజు పట్ల ఆరాధనా భావం పెరిగింది. అప్పుడు ఆ ప్రాంత వాసులను  ఏకం చేసి అక్రమాలకు, అణిచివేతకు వ్యతిరేకంగా వారి హక్కుల కోసం  ఉద్యమించాలని భావించి వారిలో  ఉద్యమ పిపాసను విస్తృతం చేశాడు.  గెరిల్లా యుద్ధరీతిలో శిక్షణ ఇచ్చాడు. మన్య ప్రజల సంప్రదాయిక ఆయుధాలు, ఆధునిక ఆయుధాలతో ఉద్యమం జరగాలని తన వ్యూహం. తను ఎంచుకున్న గెరిల్లా పోరుకు ఆధునిక ఆయుధాలు కావాలనే నిర్ణయానికి వచ్చాడు రామరాజు. అందుకు పోలీస్‌‌‌‌ ‌‌‌‌స్టేషన్లు కొల్లగొట్టాలి.  దీని కోసం ఎండు పడాలు, గంతన్న, రామరాజు-మల్లు నాయకత్వాలలో మూడు దళాలను ఏర్పాటు చేశారు.

మొదటి ప్రపంచ యుద్ధ విజయంతో అహంకారంతో విర్రవీగుతున్న బ్రిటిష్‌‌‌‌ ‌‌‌‌ప్రభుత్వం అల్లూరి సీతా రామరాజు నాయకత్వంలో సాగిన ఉద్యమాన్ని అత్యంత కఠినంగా అణచివేసింది. కానీ అల్లూరి అమరుడిగా నిలిచిపోయాడు. ఆయన ఖద్దరు ధరించాడు. కొమురం భీం వంటివారికి స్ఫూర్తిగా నిలిచాడు. రామరాజు భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అమేయమైన స్థానం సాధించుకున్నాడు. అట్టడుగున ఉన్నవారిలో కూడా జాతీయతా భావాన్ని నింపి దేశం కోసం పోరాడేటట్టు చేసిన రామరాజు చిరస్మరణీయుడు.  అల్లూరి 125 వ జయంతి 
సందర్భంగా ఇదే నివాళి.                                                                                                           - జి. కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి