కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. గురువారం ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాబోయే ఐదేండ్లలో బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు.
బొగ్గు ఉత్పత్తి పెంచుతాం ఖనిజాలు వెలికి తీసి ఉపాధి కల్పిస్తాం: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే ఐదేండ్లలో బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖనిజాలను వెలికి తీస్తామని, ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారు. గడిచిన పదేండ్లలో ప్రధాని నరేంద్ర మోదీ.. విద్యుత్ కోతకు చెక్ పెట్టారన్నారు. దీనికి ప్రధాన కారణం బొగ్గు ఉత్పత్తి పెరగడమే అని తెలిపారు. గురువారం ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వేంకటేశ్వర స్వామి, కనక దుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అటు నుంచి నేరుగా బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొంత బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తాం. ఎంతో నమ్మకంతో ప్రధాని మోదీ నాకు రెండు శాఖల బాధ్యతలు అప్పగించారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద మోదీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’అని తెలిపారు. పదేండ్ల కింద వరకు దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేదన్నారు.
కేంద్ర మంత్రిగా సంజయ్ బాధ్యతలు ఆశీర్వదించిన విద్యారణ్య భారతి స్వామిజీ
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఢిల్లీ నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయంలో తనకు కేటాయించిన సీటులో కూర్చొని బాధ్యతలు చేపడుతూ సంతకం చేశారు. ఈ సందర్భంగా జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. బాధ్యతల చేపట్టే ముందు పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు సంజయ్‌ని తన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. కాగా, ఈ నెల 17న బండి సంజయ్ రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంజయ్‌కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సంజయ్‌కు అభినందనల వెల్లువ
బాధ్యతలు చేపట్టిన సంజయ్‌ను మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యేలు రాజా సింగ్, వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర రావు తదితరులు సత్కరించారు.