- వరద బాధితులను ఆదుకుంటామని హామీ
- హైదరాబాద్ లోని వరద ప్రాంతాల్లో పర్యటన
- రాష్ట్ర సర్కార్ నుంచి సాయం అందడం లేదని బాధితుల గోడు
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్‌లో లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారని, వారందరినీ ఆదుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్యకుంట, ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ చెరువు, మలక్‌పేటలోని సైదాబాద్ సంకేశ్వర్ బజార్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. ప్రజలు కట్టుకున్న ఇండ్లను రెగ్యులరైజ్ చేసి పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్‌ఎంసీకి ఆ ఇండ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అన్ని శాఖలు కో ఆర్డినేషన్‌తో పని చేసి భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఒక్క ఇల్లు కూడా మునగకుండా చర్యలు చేపట్టాలన్నారు. మానవ తప్పిదంతోనే నాలాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయని, ఇప్పటికైనా సరిదిద్దాలని సూచించారు.
10 వేల సాయమూ అందడం లేదు: బాధితులు
వరదలతో తాము ఎంతో నష్టపోయామని, తమను రాష్ట్ర సర్కార్ ఆదుకోవడం లేదని వరద బాధితులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎదుట వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.10 వేలు కూడా అందడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం కిషన్‌రెడ్డి పర్యటనలోనూ చాలా మంది బాధితులు సాయం అందలేదని చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం ఆయన పర్యటించే సమయంలోనే నాగమయ్యకుంట బాధితులకు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు రూ.10 వేల చొప్పున సాయం అందజేశారు. పర్యటనలో భాగంగా కిషన్‌రెడ్డి ఆలయాల్లో పూజలు చేశారు.
త్వరగా రిపోర్టు ఇవ్వండి
వర్షాల నష్టంపై రిపోర్టును త్వరగా ఇవ్వాలని సెంట్రల్ టీమ్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఆయనతో సెంట్రల్ టీమ్ప్రతినిధులు భేటీ అయ్యారు. నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి రిపోర్ట్ అందలేదని సెంట్రల్ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్న ప్రవీణ్ వశిష్ట చెప్పారు. ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చే నిధులను రాష్ట్రం ఖర్చు పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో హైవేల రిపేర్లకు రూ.202 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేసిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దెబ్బతిన్న నేషనల్ హైవేల రిపేర్లకు కేంద్ర ప్రభుత్వం రూ. 202.3 కోట్లు విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 8 నేషనల్ హైవేల రిపేర్లు, మెయింటనెన్స్ కోసం ఈ నిధులు అవసరమని గతంలోనే గుర్తించి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆమోదించిందని పేర్కొన్నారు. ఈ నిధులు విడుదల చేయాలని కోరుతూ సెంట్రల్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు, హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీని పలుసార్లు కలిసి విజ్ఞప్తి చేశానని, ఆయన ఆదేశాలతో నిధులు విడుదల చేశారని కిషన్‌రెడ్డి వివరించారు. భారీ వర్షాలు, వరదలతో రోడ్లు దెబ్బతిన్న టైంలో కేంద్రం నుంచి నిధులు రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనల కన్నా కేంద్రం 85 శాతం నిధులు అదనంగా ఇచ్చిందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.