- ప్రజలకు కేంద్ర మంత్రికిషన్ రెడ్డి సూచన
- సహాయక చర్యల్లో పాల్గొనాలనిబీజేపీ కార్యకర్తలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు వెళ్లవద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు మరో 24 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ఆదివారం ఒక ప్రకటనలో కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు.
నాలాలు, డ్రైనేజీ పొంగి పొర్లుతున్నందున చిన్నారులు, వృద్ధులను బయటకు పంపవద్దన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడి కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు.
నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లి ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయన్నారు. కొన్ని చోట్ల చెరువులు తెగాయని, ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులంతా జాగ్రత్తగా ఉంటూ అధికారులకు సహకరించాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.