
- హామీల అమలు కోసం ప్రజా ఉద్యమం చేపట్టాలి
- కార్యకర్తలు, నేతలకు కిషన్ రెడ్డి పిలుపు
- జూన్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కామెంట్
- పార్టీ స్టేట్ ఆఫీసులో ఆఫీస్ బేరర్లు, జిల్లా అధ్యక్షుల భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ నెలలో జరిగే అవకాశముందని, ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కార్యకర్తలు, నేతలకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆఫీస్ బేరర్లు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. సంస్థాగత ఎన్నికలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ, అటల్ శతజయంతి ఉత్సవాలు, అంబేద్కర్ జయంతి తదితర అంశాలపై చర్చించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేసినా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచామని, ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలన్నారు. ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై నాయకులు, కార్యకర్తలు మరింత పోరాడాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీఆర్ఎస్ మళ్లీ ముందుకు రాకుండా చేయడంతో పాటు కాంగ్రెస్ పైనా పోరాడాలన్నారు. రాష్ట్రంలో బూత్, మండల, జిల్లా కమిటీలు పూర్తయ్యాయని, పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు.
నిరుద్యోగ సమస్యపై యువ మోర్చా ఆధ్వర్యంలో పోరాటాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఇన్ చార్జి అభయ్ పాటిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ బాబు, పైడి రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డిని ఈ సందర్భంగా సన్మానించారు.
6 నుంచి 12 వరకు బీజేపీ ఆవిర్భావ వేడుకలు
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 6 నుంచి 12 వరకు వివిధ కార్యక్రమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు ఆయన వివరించారు. రాష్ట్రంలో బీజేపీకి 40.78 లక్షల సభ్యత్వం ఉందని, దీంట్లో 45 వేల క్రియాశీల సభ్వత్వం అని తెలిపారు. ఏప్రిల్ 8, 9న మండలాల వారీగా క్రియాశీలక కార్యకర్తల సమ్మేళనాలు.. 10, 11, 12న గావ్ చలో, బస్తీ చలో అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 14 నుంచి అంబేద్కర్ విగ్రహాల వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.