- యూపీఏ ఇచ్చింది రూ. 45 వేల కోట్లే
- అంకెలు, ఆధారాలతో సహా చర్చిద్దాం.. సిద్ధమా?
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్ సవాల్
- సీఎం హోదాలో ఉండి అబద్ధాలను ప్రచారం చేస్తరా?
- ఎన్డీఏ హయాంలో 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చినం
- అయినా గాడిద గుడ్డు అనడం దారుణమంటూ బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి వారి నిర్ణయాన్ని ప్రభావితం చేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సీఎంగా, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, మంత్రులు, అభ్యర్థులు, నాయకులు అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో అబద్ధాలను ప్రచారం చేయడమంటే ప్రజలను తప్పుదోవ పట్టించి సామాజిక వాతావరణాన్ని కలుషితం చేయడమే అవుతుందన్నారు. శనివారం ఆయన ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
2014–24 మధ్య కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ అనడం సరికాదన్నారు. ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయడం సీఎంగా రేవంత్ స్థాయినే కాకుండా.. ఆ పదవినీ దిగజార్చినట్టే అవుతుందన్నారు. ‘‘గత పదేండ్లలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది. 2004 నుంచి 2014 మధ్య యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి రూ.1.32 లక్షల కోట్లు ఇచ్చింది.
అందులో తెలంగాణ వాటా రూ.45 వేల కోట్లకు మించదు. ఉమ్మడి ఏపీకి అప్పటి యూపీఏ సర్కార్ ఏమిచ్చిందో.. ఈ పదేండ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభు త్వం ఏమిచ్చిందో చర్చకు రావాలి”అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘అంకెలు, ఆధారాలతో సహా చర్చిద్దాం. కొడంగల్లో అయినా.. అమరవీరుల స్థూపం వద్దయినా.. కృష్ణా లేదా గోదావరి ఒడ్డునైనా సరే. స్థలం, సమయం, తేదీ మీరే నిర్ణయించండి. అర్థవంతమైన చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. చర్చ సందర్భంగా ఉపయోగించే భాష హుందాగా ఉండాలని కోరుతున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.
4 రెట్లు ఎక్కువ నిధులిచ్చినం
2014కు ముందుతో పోలిస్తే ఆ తర్వాత పదేండ్లలో తెలంగాణకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచి 2014 వరకు 67 ఏండ్లలో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల హైవేలు నిర్మిస్తే, మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక గత పదేండ్ల కాలంలోనే రూ.1.09 లక్షల కోట్లకు పైగా వెచ్చించి కొత్తగా మరో 2,500 కిలోమీటర్ల హైవేలను నిర్మించామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (భూసేకరణకు 50 శాతం కేంద్ర నిధులు) సహా మరో 2,500 కిలోమీటర్ల మేర హైవేలను నిర్మించాల్సి ఉందన్నారు. ‘‘రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి ఎరువుల కొరతను తీర్చడంతోపాటు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించాం.
1,600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేయాలని కోరితే నాటి మన్మోహన్ ప్రభుత్వం తిరస్కరించింది. కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక ఎయిమ్స్ మంజూరు చేసి, నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 2014కు ముందున్న పెండింగ్ ప్రాజెక్టులనూ మోదీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్100 శాతం కేంద్ర నిధులతో పూర్తయింది. హార్టికల్చర్ యూనివర్సిటీ, సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ వంటివి గత10 పదేండ్లలోనే వచ్చాయి.
మెగా టెక్స్టైల్ పార్క్, కాజీపేట రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ, పసుపు బోర్డు వంటి కేంద్ర ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవనున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే సీఎం స్థాయిలో ఉన్న మీరు తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు అనడం పూర్తిగా అబద్ధాలను వ్యాప్తి చేయడమే’’ అని రేవంత్ ను కిషన్ రెడ్డి విమర్శించారు.