విభజన చట్టం ప్రకారమే ఏపీకి నిధులు : కిషన్ రెడ్డి

  • అందుకే  స్టీల్ ప్లాంట్​కు రూ.11,445 కోట్లు : కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విభజన చట్టం ప్రకారమే ఏపీకి నిధులు కేటాయిస్తున్నామని, అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ కు రూ.11,445 కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం బీజేపీ స్టేట్  ఆఫీసులో మీడియాతో ఆయన చిట్ చాట్  చేశారు. ఏపీలోని వైజాగ్​ స్టీల్, తెలంగాణలోని బయ్యారం స్టీల్  వేర్వేరు అని, బయ్యారం ప్లాంట్  ముగిసిన చరిత్ర అని, దానికి వయబిలిటీ లేదన్నారు. తెలంగాణలో మెట్రో ఫస్ట్  ఫేస్ కు కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు ఇచ్చిందని, కానీ..  ఆ ప్రాజెక్టు పూర్తి చేయకుండా అప్పట్లో అఫ్జల్ గంజ్​లో బీఆర్ఎస్  అడ్డుకుందన్నారు. 

అప్పుడు మజ్లిస్  కూడా మెట్రోను వ్యతిరేకించిందని, ప్రస్తుతం స్టాండ్  మార్చుకుని కట్టాలని కోరుతున్నారన్నారు. ఆర్ఆర్ఆర్  అలైన్ మెంట్  త్వరలో పూర్తి చేస్తే రీజినల్ రైల్  సర్వే ప్రారంభిస్తామని తెలిపారు. బీఆర్ఎస్  పెట్టిన ట్రిపుల్  ఆర్   అలైన్మెంట్, కాంగ్రెస్  ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్​లో చాలా మార్పులు ఉన్నాయన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. మూసీ సుందరీకరణ జరగాల్సిందేనని, అయితే.. పేదల ఇండ్లు కూల్చకుండా చేపట్టాలన్నారు. గ్రామాల్లో జరిగిన పనులన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగాయన్నారు.  

వారంలో జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తి

లోక్ సభ ఎన్నికలు పూర్తయిన  కొద్ది రోజుల్లోనే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైందని, అందుకే కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయామని కిషన్  రెడ్డి చెప్పారు. ఇప్పటికే సుమారు 700 మండలాలకు 650 కమిటీలు వేశామని, దీంట్లో సగానికిపైగా బీసీలే ఉన్నారని, 80 శాతం వరకు కొత్తవారు ఎన్నికయ్యారని వివరించారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల ప్రక్రియ మొదలైందని, వారంలో ఈ ప్రాసెస్  పూర్తవుతుందని తెలిపారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ మహిళలకు 33 శాతం మంది పోస్టులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ తర్వాతి ప్రెసిడెంట్ కేటీఆరే

బీజేపీలో ఎవరు స్టేట్ ప్రెసిడెంట్ అవుతారనే దానిపై ముందుగా తెలుసుకోవడం కష్టమేనని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలను తీసుకొని జాతీయ అధిష్టానం ప్రెసిడెంట్ ను ఎంపిక చేస్తుందని తెలిపారు. కానీ, బీఆర్ఎస్ లో తర్వాతి ప్రెసిడెంట్  కేటీఆరే అవుతారని, ఆ విషయం అందరికీ తెలుసన్నారు. బొగ్గు గనుల మంత్రిగా తన శాఖ పరిధిలో పనిచేసే 6 లక్షల మందికి రూ.కోటి చొప్పున ఇన్సూరెన్స్ చేయబోతున్నామని తెలిపారు. 

గనులు నేషనల్ ప్రాపర్టీ అని, వాటిలో రాష్ట్రాలకు హక్కు ఉండదన్నారు. అందుకే, అన్నింటిని కేంద్రం పరిధిలోకి తీసుకుంటామన్నారు. వరంగల్​లో టెక్స్ టైల్  పార్క్​కు ల్యాండ్  ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉంటే పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.