- అహంకారం, అవినీతి, నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నది
- సర్కార్ వైఫల్యాలపై నేడు చార్జ్‌షీట్ విడుదల చేస్తామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్హయాంలో మొదలైన అహంకారం, నియంతృత్వం, అవినీతిని కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ఆదివారం చార్జ్‌షీట్‌ను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో నిర్వహించిన సంఘటన్ పర్వ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.
ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రం పదేండ్లపాటు కేసీఆర్ కుటుంబం పాలైందని, ఆ తర్వాత కాంగ్రెస్‌ను గెలిపించినా జనం బతుకుల్లో మార్పు రాలేదని అన్నారు. ఉద్యోగాలిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా రాలేదని విమర్శించారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లను ప్రాసెస్ చేసి తామే ఉద్యోగాలిచ్చినట్టు రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
డిసెంబర్ 7న ప్రమాణం చేశాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పారని, కానీ, ఉన్న రూ.2 వేల పింఛన్నే టైమ్‌కు ఇవ్వడం లేదన్నారు. పంచాయతీలకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా నిధులను విడుదల చేయడం లేదని ఆరోపించారు.
15వ ఆర్థిక సంఘం నిధులతోనే పంచాయతీల్లో చిన్న చిన్న అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలను ఏకం చేసి ఉద్యమబాట పట్టాలని, అందుకు తగ్గట్టుగా పార్టీ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు.
బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కార్యకర్తలకు కిషన్ రెడ్డి సూచించారు. బూత్ స్థాయి నుంచే మంచి నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని, అందుకే పోలింగ్ బూత్ స్థాయిలోనూ కొత్త కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని ఇటీవల ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశంలో ప్రధాని మోదీ చెప్పారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అండగా నిలబడుతున్నదని, హైవేలు, రైల్వేల అభివృద్ధి కోసం కేంద్రం సహకారమందిస్తున్నదని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు.