హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ లో మోడీ సభా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నగరంలో పలు ప్రాజెక్టులను మోడీ ప్రారంభించనున్నారని తెలిపారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఆగిపోయిందని విమర్శించారు.
‘‘మెరుగైన రవాణా ఉంటేనే ప్రజల జీవన పరిస్థితులు బాగుంటాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి రూట్ లో వందే భారత్ రైలును మోడీ ప్రారంభిస్తారు. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, నెల్లూరు మీదుగా తిరుపతి వెళ్తుంది. తెలంగాణపై కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మోడీ హయాంలో 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేలు నిర్మించాం. ఇప్పటికే అన్ని స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించాం.అంకిత భావంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. తెలంగాణలో రైలు సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఎయిమ్స్ భవనానికి రూ. 1350 కోట్లతో భూమి పూజ చేస్తారు. ప్రధాని వస్తే స్వాగతం పలకాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిరసనలకు సిద్ధమవుతోంది. రీజనల్ రింగు రోడ్డును సైతం కేంద్రం నిధులతోనే పూర్తి చేస్తాం’’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.