వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి డబ్బులు ఎన్ని కోట్లు ఖర్చు చేసిన గద్దెదిగక తప్పదని చెప్పారు. వరంగల్ జిల్లా బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రగతిభవన్ కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ప్రగతిభవన్ అని అన్న కిషన్ రెడ్డి.. బీజేపీ అధికారంలోకి వచ్చాక వచ్చాక దానిని ప్రజల ప్రగతిభవన్ గా మార్చుతామని చెప్పారు.
రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న కేసీఆర్ హామీ- ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్ని్ంచారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు దాని సంగతి ఏంటనీ నిలదీశారు. కేసీఆర్ మాటలు కోటలు దాటాయి తప్ప, అమలు తీరు ప్రగతిభవన్ గడప దాటలేదని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నీతి నిజాయితీతో పాలన సాగిస్తుందని వెల్లడించారు. 500 శాతం ఎరువులు ధర పెరిగితే ఒక్క రూపాయి కూడా రైతులపై భారం పడకుండా మోడీ ప్రభుత్వం చూస్తుందని తెలిపారు.
కర్నాటక రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరని చెప్పారు కిషన్ రెడ్డి. అద్యక్ష పదవి చేపట్టలేనని పారిపోయిన రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్.. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కలలో కూడా జరగదని జోస్యం చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2023 జులై 8న జరగబోయే మోడీ సభను విజయవంతం చేయాలని కోరారు కిషన్ రెడ్డి.