జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
  • అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తరు
  • ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలి
  • మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ.3 లక్షలు
  • సెప్టెంబర్​ 17న అధికారికంగాహైదరాబాద్ ముక్త్ దివస్ నిర్వహిస్తం

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే వాళ్లు సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడి రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ టీములను పంపించారని, సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఇప్పటికే కేంద్రం నిధులు ఇచ్చిందని, వాటితో బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తారని, ప్రస్తుతమైతే జాతీయ విపత్తు ప్రకటన చేయడం లేదని వెల్లడించారు. త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు రోజులుగా భారీ వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు 11 జిల్లాల్లో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే, వరదలతో ప్రాణనష్టం జరగడం దురదృష్టకరమన్నారు.

చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్లు, ఆస్తులు కోల్పోయారని, మరికొన్ని చోట్ల రోడ్లు, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్​డీఆర్ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూ.1345 కోట్లు ఉన్నాయని, జూన్ 1న కేంద్రం రూ.208 కోట్లు ఇచ్చిందని తెలిపారు. గతంలో కేంద్రం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ రిలీజ్ చేసినా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరితో బాధితులకు సాయం అందలేదన్నారు.

సాయంపై రాష్ట్రం స్పష్టత ఇవ్వాలె

వరదల కారణంగా మరణించిన మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని కిషన్ రెడ్డి చెప్పారు. సీఎం ప్రకటించిన రూ.5 లక్షల్లో కేంద్రం విడుదల చేసే మూడు లక్షలు కలుపుకొని ఇస్తారా.. లేదా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.5 లక్షలు ఇస్తదా? క్లారిటీ ఇవ్వాలని కోరారు. కేంద్రం నుంచి క్షతగాత్రులకు.. 60 శాతం పైబడిన వైకల్యానికి రూ.2.5 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి వారానికన్నా ఎక్కువ రోజు ఆసుపత్రిలో ఉంటే రూ.16వేలు, వారం కన్నా తక్కువ రోజులుంటే రూ.5,400 చొప్పున అందిస్తుందని వెల్లడించారు.

వరదల కారణంగా దుస్తులు నష్టపోయిన వారికి రూ.2,500, వంటపాత్రలు నష్టపోయిన వారికి రూ.2,500, పాడి పశువులను కోల్పో యిన రైతులకు గేదె, ఆవులకు అయితే ఒక్కో దానికి రూ. 37,500, గొర్రె, మేకలకు అయితే.. ఒక్కోదానికి రూ.4వేలు, ఒక్కో ఎద్దుకు రూ. 32వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక సాయాన్ని బాధితులకు అందజేయాలని కోరారు.

పరేడ్​గ్రౌండ్​లో ముక్త్ దివస్​వేడుకలు

రెండేండ్లుగా సెప్టెంబరు 17 రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా హైదరాబాద్ ముక్త్ దివస్ ను నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది కూడా ఈ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తామన్నారు. గతంలో ఎంఐఎంకు భయపడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించలేదని, దీంతో కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని నిర్వహిస్తుందని వెల్లడించారు. వరదల కారణంగా సభ్యత్వ సేకరణ కార్యక్రమం వాయిదా వేశామని చెప్పారు.