- అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చినోళ్లే.. ఇప్పుడు కూల్చుతున్నరు
న్యూఢిల్లీ, వెలుగు : హైడ్రా పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో ఇవే చట్టాలు ఉన్నాయని, మరి అప్పుడెందుకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ నిర్మాణాలను కట్టారని, ఇప్పుడు తొలగిస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. అవన్నీ అక్రమ నిర్మాణాలే అయితే.. అప్పుడు వాటికి ఎలా అనుమతులిచ్చారు? ఇన్ని రోజులు ఎలా కరెంట్ ఇచ్చారు? ట్యాక్స్‌లు ఎలా వసూలు చేశారు? అని ప్రశ్నించారు.
పాలకులు, అధికారులు కుమ్మక్కై ఏ విధంగా ఈ అక్రమ నిర్మాణాలను పెంచి పోషించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ నిర్మాణాలకు అనుమతులు, వాటర్, పవర్ సరఫరా, రోడ్లు, ఇతర సౌకర్యాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కూడా దర్యాప్తు చేయాలన్నారు. కూల్చివేతలపై మరింత లోతుగా చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలని, ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే సరికాదని హితవు పలికారు.
మరోవైపు, బీబీనగర్ ఏయిమ్స్‌కు అనుబంధంగా అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (యూహెచ్‌టీసీ)ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌లో రెండెకరాల భూమిని కేటాయించాలని లేదా అప్పటి వరకు తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. అలాగే, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.