మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డతోపాటు అందరి నెత్తి మీద కేసీఆర్ రూ.లక్షన్నర అప్పు పెట్టాడని మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్లకు, పారిశుద్ధ కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. మునుగోడు మండలం రత్తిపల్లి, గంగోని గూడెం, ఊకొండి, సింగారం గ్రామాల్లో ఆయన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబసభ్యులు మునుగోడుకు వస్తూ వస్తూ సూట్ కేసుల నిండా డబ్బులు, లారీల నిండా బ్రాండీ, విస్కీ, ట్రక్కుల నిండా చికెన్, బిర్యానీ పొట్లాలు తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అడుగడుగునా వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఓపెన్ చేశారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కు, ఆయన కొడుక్కి, కూతురికి, అల్లుడికి ఇలా అందరూ ఫామ్ హౌస్ లు కట్టుకున్నారన్నారు. సొంతంగా విమానం కూడా కొనేందుకు సిద్ధమయ్యారన్నారు. కానీ గ్రామాల్లో ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రం కట్టివ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్ కేవలం తన కుటుంబ సభ్యులను, చెంచాలను మాత్రమే కలుస్తాడని విమర్శించారు. ‘నేను నిజాం రాజును. నా తర్వాత నా కొడుకు, తర్వాత నా మనవడు, ఆ తర్వాత నా మునిమనవడు ముఖ్యమంత్రి కావాలి తప్పా..తెలంగాణకు దళితులు, బీసీలు, రైతులు, రైతు కూలీలు సీఎం కావొద్దు’ అని సీఎం అనుకుంటున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వసూళ్లు చేయడంలో దిట్ట అని, తను వార్డెన్ గా పని చేసినప్పుడు పిల్లల బియ్యాన్ని అమ్ముకున్నాడని ఆరోపించారు. మునుగోడు మండల పరిధిలోని రత్తుపల్లి,గంగూరి గూడెం, ఊరుకోండి, సింగారం, మునుగోడు గ్రామంలో మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలి
చండూరు,( మర్రిగూడ): కేంద్ర పథకాలను కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చెప్పాలని మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం మర్రిగూడ మండలంలో రాంరెడ్డి పల్లిలో బూత్ కమిటీ స్థాయి మీటింగులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 13 ఏండ్ల నుంచి ఉచితంగా బియ్యాన్ని ఇస్తోందని, కరోనా నుంచి కాపాడడానికి వ్యాక్సిన్కూడా ఫ్రీగానే ఇచ్చిందన్నారు. మునుగోడులో ఫ్లోరోసిస్ తరిమికొట్టడానికి కేంద్రం రూ.800 కోట్లు ఇచ్చిందన్నారు. మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, తుల ఉమా పాల్గొన్నారు.