
- పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు
- బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తలదన్నేలా కాంగ్రెస్ వ్యవహారం
- గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని కామెంట్
- బడ్జెట్ ఓం భూం.. బుష్..: సంజయ్
న్యూఢిల్లీ, వెలుగు: పదేండ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఘాతంలోకి నెట్టేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అంచనాలు భారీ.. కేటాయింపులు, అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. గ్యారంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉందన్నారు. అంకెల గారడీతో ప్రజలను మరోసారి కాంగ్రెస్ మోసం చేసిందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. గతేడాది బడ్జెట్ పెట్టినపుడు.. తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారని, మరి 15 నెలలపాటు పాలించిన తర్వాత కూడా 6 గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించడమేంటని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆదాయం, రాబడిపై కనీస అవగాహన లేకుండా అంచనాలు రూపొందించారని విమర్శించారు. 2024-–25 బడ్జెట్ లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపిస్తే.. సవరించిన అంచనాల్లో రూ.5 వేల కోట్లు తగ్గించి రూ.53,665 కోట్లుగా వెల్లడించారని చెప్పారు. అంటే దాదాపు 8.5% శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయని, ఇందుకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం వినియోగాన్ని పెంచి, ఆదాయం పెంచుకోవాలనుకోవడం దురదృష్టకరమన్నారు.
గత బడ్జెట్‌లో రూ. 60 వేల కోట్ల అప్పులు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. రూ.లక్షన్నర కోట్ల అప్పులు (స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో తీసుకున్న రుణాలు కలుపుకుని) చేసిందని ఆరోపించారు. ఇప్పుడు రూ.74 వేల కోట్లు అంటే, రూ. 2.25 లక్షల కోట్లు దాటుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అప్పుల విషయంలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని అన్నారు.