
- 15 నెలల్లోనే రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు
- అప్పులు, అవినీతిలో గత కేసీఆర్ సర్కార్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ
- డీలిమిటేషన్, ఎన్ఈపీపై కాంగ్రెస్, డీఎంకే దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రూ.1.52 లక్షల కోట్ల అప్పు చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ప్రజాపాలన అంటే అప్పుల పాలనా? అప్పులు, అవినీతిలో గత కేసీఆర్ ప్రభుత్వంతో కాంగ్రెస్ పోటీ పడుతున్నది. మార్పు అంటే ఇదేనా?” అని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. గత కేసీఆర్ సర్కార్ చేసిన ఏడున్నర లక్షల కోట్ల అప్పు విషయం తనకు తెలియదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రేవంత్ సీఎం అయ్యాక జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చిందని గుర్తుచేశారు.
స్టాలిన్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత..
డీలిమిటేషన్, ఎన్ఈపీపై కాంగ్రెస్, డీఎంకే దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘డీలిమిటేషన్ అంశంపై గత రెండు నెలలుగా తమిళనాడు సీఎం స్టాలిన్ వితండవాదం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ.
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే డీలిమిటేషన్ అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు” అని అన్నారు. తమిళ భాష అభివృద్ధి కోసం స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.