సర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు: కిషన్​రెడ్డి

సర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు: కిషన్​రెడ్డి
  • తెలంగాణలో సింగిల్​గానే పోటీ చేసి అధికారంలోకి వస్తం
  • ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలపై ఫోకస్ పెడ్తం
  • హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తం
  • రాజాసింగ్ సమస్య ఇంటర్నల్​గా పరిష్కరించుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్​ సర్కారును కూలగొట్టే ఆలోచన తమకు లేదని, కూల్చితే తమకేం వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ పార్టీకి  ఐదేండ్లు పాలన చేయాలని ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పారు. అయితే, ఆ పార్టీ తీరుతో రాబోయే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతుందని, ఈ విషయం కామన్ మెన్ కూడా చెబుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అని ఎవరైనా మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొట్టాలని సూచించారు. రాష్ట్రంలో సింగిల్​ గానే ఎన్నికల బరిలోకి దిగి.. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మంగళవారం కిషన్​రెడ్డి హైదరాబాద్​లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, పుదుచ్చేరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవుల నియామకం పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ నెలలో ఈ అంశం పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ అధ్యక్షుడి ప్రతిపాదనల లిస్ట్​లో తన పేరు లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకేతో గతంలో కలిసి పనిచేసిన అనుభవం ఉందని, అందుకే అక్కడ మరోసారి పొత్తుపెట్టుకుంటున్నట్టు చెప్పారు. 

రాష్ట్రంలో పొత్తులపై మాత్రం  సమాధానం దాటవేశారు. పునర్విభజన అంశంపై పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని  తెలిపారు. తెలంగాణలో భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించిందని విమర్శించారు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనే ధోరణి సరికాదని పేర్కొన్నారు. 

అర్ధరాత్రి చెట్లు నరకడం దారుణం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్​సీయూ)లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ను ఉల్లంఘించి, అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో చెట్లు నరకడం దారుణమని కిషన్​రెడ్డి అన్నారు. ఈ భూముల్లో జంతువుల అరుపులు ఏఐ సృష్టి అని చెప్తున్నారని, భూమి ఎవరిదైనా చెట్లు నరకడం కరెక్ట్ కాదని చెప్పారు. ఈ భూములను అమ్మకపోతే కంపెనీలు రావనే వాదనను తప్పుపడుతున్నట్టు చెప్పారు. వక్ఫ్ బోర్డుపై ఆందోళన చేయడమంటే.. భూ బకాసురులకు వంతపాడటమేనని, ఆందోళన చేసే వాళ్లంతా ల్యాండ్ గ్రాబర్స్ మాత్రమేనని అన్నారు. 

లక్షల ఎకరాల వక్ఫ్ భూములున్నప్పటికీ, నిరుడు కేవలం రూ.160  కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. మసీదులు, ప్రార్థనా స్థలాలకు.. వక్ఫ్​కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.  దీనిద్వారా నిరుపేద ముస్లింలకు న్యాయం జరగడం లేదని తెలిపారు. ఈ నెల 17న పార్టీ నేతలకు వక్ఫ్ బోర్డుపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని  ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీలతో  కలిసి లబ్ధిపొందుతూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని మజ్లిస్ పార్టీ చూస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్రం ఇస్తున్న రేషన్ బియ్యం 5 కేజీలు కాకుండా దమ్ముంటే అదనంగా సన్నబియ్యం ఇవ్వాలని సర్కారును డిమాండ్ చేశారు. ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలనే భావనలో ఉన్నామని చెప్పారు.