ఏడాదిలో ఏం చేశారు? : కిషన్ రెడ్డి

ఏడాదిలో ఏం చేశారు? :  కిషన్ రెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న
  • విపక్షాలను తిట్టడంమాని పాలనపై ఫోకస్ పెట్టాలని హితవు

న్యూఢిల్లీ, వెలుగు: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, 420కి పైగా సబ్ గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయకపోగా వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. బెదిరింపులు, తిట్లు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలిమాటలు తప్ప ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ సాధించిందేమీ లేదని విమర్శించారు. దీంతో గడిచిన 11 నెలల్లోనే.. 11 ఏండ్లలో రావాల్సిన వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకున్నదన్నారు. కిషన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్  ఒక్కటేనని, ఆ పార్టీల తీరుతో రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతున్నదని విమర్శించారు. అప్రజాస్వామిక భాష మాట్లాడడాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే.. దాన్ని రేవంత్ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాదిరిగానే అప్పులమీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తున్నదన్నారు. విపక్షాలను తిట్టడం మీద పెట్టే ఫోకస్ పాలనపై పెడితే రాష్ట్రం పరిస్థితి బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పాత అలవాటు ప్రకారం.. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. 

మీలాగా పది పార్టీల మారిన డీఎన్ఏ కాదు

మూసీ అంశంపై ఆందోళన చేస్తే సీఎం వ్యక్తిగతంగా మాట్లాడతున్నారే తప్ప సమాధానం ఇవ్వడం లేదని కిషన్​రెడ్డి అన్నారు. నాలుగైదు నెలలుగా రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని, అనేక ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇవేమీ పట్టించుకోని సీఎం.. ‘ఏదైనా సమస్య గురించి మాట్లాడితే.. కిషన్ రెడ్డి డీఎన్ఏ ఏంటి అని అడుగుతున్నరు. నా డీఎన్ఏ బీజేపీ. మీలాగా పది పార్టీలు తిరిగిన డీఎన్ఏ కాదు’ అని రేవంత్ రెడ్డిపై ఫైర్​ అయ్యారు.