బీఆర్ఎస్, కాంగ్రెస్.. సేమ్ టు సేమ్ : కిషన్ రెడ్డ

బీఆర్ఎస్, కాంగ్రెస్.. సేమ్ టు సేమ్ : కిషన్ రెడ్డ
  • కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నడు: కిషన్ రెడ్డి
  • బీఆర్ఎస్ పై పదేండ్లకు వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్ పై ఏడాదికే వచ్చిందని కామెంట్
  • స్థానిక ఎన్నికల్లోపే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని వెల్లడి 

వరంగల్‍/హనుమకొండ/జనగామ, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ మక్కీ టు మక్కీ.. సేమ్‍ టు సేమ్‍ ప్రభుత్వాలే. కేసీఆర్‍ కుటుంబమంతా ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నదని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు బీఆర్‍ఎస్‍ బాటలోనే అప్పుల కుప్పలో నడుస్తున్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయలేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో గత బీఆర్‍ఎస్‍ ప్రభుత్వంపై పదేండ్లకు వ్యతిరేకత వస్తే, కాంగ్రెస్‍ సర్కార్ పై ఏడాదికే వచ్చింది” అని కామెంట్ చేశారు.

బీఆర్‍ఎస్‍తో బీజేపీ కలిసిందని పనికిమాలినోళ్లే మాట్లాడుతున్నారు. గతంలో ఎవరితో ఎవరు కలిసి పనిచేశారో గుర్తు లేదా?” అని ప్రశ్నించారు. వరంగల్‍, నల్గొండ, ఖమ్మం టీచర్‍ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి తరఫున గ్రేటర్ వరంగల్, జనగామలో కిషన్ రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్​లోని సత్యం కన్వెన్షన్‍ హాల్‍లో మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో ఏ ఒక్క సీఎం చేయని తరహాలో సీఎం రేవంత్‍రెడ్డి చేస్తున్నారు. వారానికోసారి ఢిల్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకుంటున్నారు. రాహుల్‍ గాంధీ డైరెక్షన్‍లో మోదీ, కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు” అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

కేసీఆర్ ది దుబారా, దోపిడీ పాలన..  

మాజీ సీఎం కేసీఆర్​ది దుబారా, దోపిడీ పాలన అని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘కేసీఆర్ మిగులు బడ్జెట్​రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. ఇప్పుడున్న సీఎం రేవంత్.. ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పుల వేటలో పడ్డాడు’’  అని అన్నారు. రాష్ట్ర ఆదాయం, ఖర్చులను సరిగా అంచనా వేయకుండా.. ప్రజలను మరింత కష్టాల్లోకి నెడుతున్నారని మండిపడ్డారు.

 తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడినా, మద్యం అమ్మకాల్లో మాత్రం దేశంలోనే నంబర్ వన్​గా ఉందని కామెంట్ చేశారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పట్లో తాను కేవలం రెండుమూడు నెలల కోసమే వచ్చానని కిషన్‍రెడ్డి తెలిపారు. అనేక కారణాలతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక వాయిదా పడుతూ వస్తున్నదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని వెల్లడించారు. 

బయ్యారం ఫ్యాక్టరీపై కేంద్రం ప్రకటన చేయలేదు.. 

బయ్యారం స్టీల్‍ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం ఏనాడూ ప్రకటన చేయలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ఆ ఫ్యాక్టరీ పెట్టేచోట దొరికేది నాసిరకం ఐరన్ వోర్‍. ఫీజిబిలిటీ లేకున్నా ఫ్యాక్టరీ పెడితే, అది మూతపడ్తదని తెలిసి కూడా.. 2018లో కేసీఆర్‍, కేటీఆర్‍, హరీశ్ రావు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో చంకలు గుద్దుకున్నారు. కేంద్ర అవసరం లేకుండానే రాష్ట్రం తరఫున తామే బయ్యారం ఫ్యాక్టరీ పెడ్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు” అని ఫైర్ అయ్యారు. ఫ్యాక్టరీ రావాలని తనకూ ఉన్నదని, అయితే ఫీజిబిలిటీ ముఖ్యమని, అందుకే ఐరన్ వోర్ క్వాలిటీపై పూర్తిస్థాయి నివేదిక అడిగానని చెప్పారు.