- హాస్పిటల్‌లో ఎంపీలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ పరామర్శ
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీలపై జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన సహచర ఎంపీలకు, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీలపై దాడి దురదృష్టకరమన్నారు. ఈ ఘటనను యవత్ సమాజం ఖండిస్తోందని తెలిపారు. శుక్రవారం పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల దాడిలో గాయపడి ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలు చంద్రప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి పరామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడి యాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకు ని యువకుడిలా కనిపించాలనుకుంటే తప్పులేదు. కానీ.. యువకుడిని అనుకుని బీజేపీ ఎంపీలపై దాడికి దిగడం దురదృష్టకరమన్నారు. వివిధ రాష్ట్రాల్లో అసెం బ్లీ, పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగి, ఎంపీలపై దాడికి దారి తీసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను తీవ్రంగా అవమానించిన విషయం దేశ ప్రజలకు తెలుసన్నారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో రెండుసార్లు అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది అని దుయ్యబట్టారు. అంబేద్కర్ ఆలోచనలను సాకారం చేసే దిశగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాలన చేస్తున్నదని చెప్పారు. అంతకు ముందు బీజేపీ ఎంపీలపై జరిగిన దాడిని నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద లక్ష్మణ్, డీకే అరుణ, గొడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆందోళన చేపట్టారు.