- కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని ఫైర్
- నిజామాబాద్‌లో ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్, వెలుగు : అక్టోబర్1న పాలమూరు, 3న ఇందూరులో ప్రధాని మోదీ సభలు ఉంటాయని.. ఆ సభలతోనే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడ్తామని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.6 వేల కోట్లతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిజామాబాద్ సభలో మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తామని చెప్పారు. నిజామాబాద్‌లోని గవర్నమెంట్(గిరిరాజ్) డిగ్రీ కాలేజీ వద్ద ప్రధాని సభ ఏర్పాట్లను కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్‌నుంచి ఆదిలాబాద్దాకా పార్టీ బలంగా ఉంది. బలహీనంగా ఉన్నామని భావిస్తున్న ఖమ్మంలోనూ మద్దతు పెరుగుతోంది. గిరిజనులు, ఇతర వర్గాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు” అని చెప్పారు. మోదీ తర్వాత కేంద్రమంత్రి అమిత్‌షాతో మరికొందరు మంత్రులు, జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వస్తారని తెలిపారు.
‘‘తెలంగాణకు ఏమిచ్చారని మోదీ వస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏమైనా కేటీఆర్జాగీరా?” అని ప్రశ్నించారు. గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.
గవర్నర్ నిర్ణయం సరైనదే..
పాలన తెలియని దద్దమ్మల చేతితో రాష్ట్రం ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్.. షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, కవిత.. ఇంట్లో కూర్చొని పనికి మాలిన ప్రశ్నలు వేస్తే, తాము ఎందుకు జవాబు చెప్తామని అన్నారు. కేసీఆర్సేవలో తరించేవారికి, ఆయనకు కొమ్ము కాసే ఏజెంట్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తరా? అని ప్రశ్నించారు. గవర్నర్సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
‘‘కవులు, కళాకారులు, మేధావులకు బదులు తన గుడుగుడుగుంచం గాళ్లను కేసీఆర్ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేశారు. ముమ్మాటికీ వాళ్లను తిరస్కరించాల్సిందే” అని అన్నారు. తాము ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను తెలంగాణ నుంచి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్చేశామని గుర్తు చేశారు. కాగా, సభకు జన సమీకరణపై బస్వా గార్డెన్లో పార్టీ ఆఫీస్ బేరర్లతో నిర్వహించిన మీటింగ్‌లో కిషన్ రెడ్డి, ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు.