టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు సమాధి నిర్మించడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికి ఉన్న వాళ్లకు సమాధి కట్టడం టీఆర్ఎస్ సంస్కృతా...? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదన్నారు. ఇలాంటి చిల్లర వేషాలు వేయడం నీచమైన చర్య అని మండిపడ్డారు. జేపీ నడ్డాకు సమాధి నిర్మించిన వారికి కనీసం సభ్యత, సంస్కారం లేదా..? ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలకు నైతిక విలువల్లేవన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఇలా ప్రవర్తిస్తోందన్నారు.
టీఆర్ఎస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ వాళ్లు ఎన్ని చేసినా సహనంతో ఉంటున్నామని, తమ సహనాన్ని అసమర్థతగా చూడొద్దన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.