వరంగల్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 14) కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది తప్ప ప్రభుత్వ విధానాలు మారలేదని విమర్శించారు. పేదలకు హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు కానీ.. సామాన్యులు కష్టపడి నిర్మించుకున్న ఇండ్లను కూలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 1 నుండి రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరాటాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తిట్టుకోవడంలో పోటీ పడుతున్నారని.. ఆ రెండు పార్టీలకు నైతిక విలువలు లేవని దుయ్యబట్టారు.
ALSO READ | త్వరగా పూర్తి చేయండి.. బీసీ కుల గణనపై తెలంగాణ సర్కార్ దూకుడు
రాజకీయ నాయకులు చేసే అసభ్యకర వ్యాఖ్యలను మీడియా కూడా ప్రసారం చేయవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల నుండి దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఇటీవలే జరిగిన హర్యానా, జమ్ము కాశ్మీర్ ఎన్నికలతో కాంగ్రెస్‌కు ప్రజలలో విశ్వాసం లేదని తేలిపోయిందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడిందని.. తెలంగాణలో తలా తోకా లేని పాలన కొనసాగుతుందని విమర్శలు గుప్పించారు. ఏ పథకానికి ఎలా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలో కూడా ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. మూసీ సుందరీకరణకు రూ.1.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.. కానీ ఆ నిధులతో ఏం చేయబోతున్నారో డీపీఆర్ మాత్రం లేదని విమర్శించారు. హామీలు ఇచ్చి చేతులెత్తేయడమే కాంగ్రెస్ నైజమని ఎద్దేవా చేశారు. సింగరేణి ప్రయివేటీకరణ చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైన్స్‌ను ప్రయివేట్ సంస్థకు ధారాధత్తం చేసిందని మండిపడ్డారు. హర్యానాలో సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతు దీక్షలు చేశారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపారని గుర్తు చేశారు. 90 శాతం ముస్లింలు ఉన్న కాశ్మీర్లో బీజేపీకి భారీగా ఓట్ పర్సంటేజ్ పెరిగిందని తెలిపారు. జమ్మూకాశ్మీర్ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సారి బీజేపీకి సీట్ల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల సహయ సహకారాలు బీజేపీ పార్టీ వైపు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.