హైదరాబాద్, వెలుగు: భారీగా కురుస్తున్న వానలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఆదేశించారు. పది, పదిహేను సెంటీమీటర్ల వానకే హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రోడ్డుపై నీళ్లు నిలిచి గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయిందని, ఇండ్లలోకి నీళ్లు రావడంతో లోతట్టు ప్రాంతాలవారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
బుధవారం ఢిల్లీ నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే సేవలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని.. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సహకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.