సీఎం కేసీఆర్ వి చిల్లర మాటలు

సీఎం కేసీఆర్ వి చిల్లర మాటలు

హైదరాబాద్, వెలుగు: సొంత డబ్బా పరనింద అన్నట్టుగా సీఎం కేసీఆర్ తీరు ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న సంగతిని మర్చిపోయి.. చిల్లర మాటలు, చిల్లర వేషాలతో ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారని ఫైర్ అయ్యారు. రెండు రోజులపాటు పరిశోధన చేసి.. రెండు గంటలు ఏకధాటిగా  ప్రెస్ మీట్ పెట్టి.. కేసీఆర్ చెప్పిందే చెప్పారని ఎద్దేవా చేశారు. ‘‘గతంలో వర్షం వచ్చినప్పుడు ఏ తప్పులు జరిగాయి? ఏ లోపం కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు? సమస్యలను ఎలా అధిగమించాలి? అనే విషయాన్ని మర్చిపోయి మరోసారి తన కల్లబొల్లి మాటలతో అసందర్భ వాచాలత్వంతో అడ్డగోలుగా మాట్లాడారు” అని ఆదివారం ఓ ప్రకటనలో సీరియస్ అయ్యారు. ‘‘కేసీఆర్ తనను తాను మహా జ్ఞాని అనుకుంటున్నారు. అన్ని విషయాలు తనకే తెలిసినట్టుగా అహంకారంతో మాట్లాడుతున్నారు. కానీ అహంకారంతో వ్యవహరిస్తున్నారని బీజేపీని, నరేంద్ర మోడీని విమర్శించడం కేసీఆర్ డొల్లతనానికి నిదర్శనం. సీఎంగా బాధ్యత కలిగిన రాజ్యాంగ పదవిలో ఉండి, హుందాగా వ్యవహరించాల్సింది పోయి, తన హోదాను మరిచి చౌకబారు భాషతో, అపహాస్యంగా, అవహేళనగా మాట్లాడటం కేసీఆర్ అసహనాన్ని, అభద్రతాభావాన్ని, భయాన్ని తెలియజేస్తున్నది” అని చెప్పారు. రాష్ట్ర, దేశ ప్రజలు అమాయకులు కారని, అబద్ధాల్ని పదేపదే చెప్పినంత మాత్రాన నమ్మరని అన్నారు. ముందుగా వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, కేసీఆర్ తన బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. దేశ స్థాయి విషయాల్ని తర్వాత చర్చిస్తే బాగుంటుందని హితవు పలికారు.

పబ్లిక్ అలర్ట్ గా ఉండాలె..

రానున్న రెండు.. మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అలర్ట్​గా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సూచించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు.  యువకులు, స్వచ్ఛంద సంస్థలు, బీజేపీ కార్యకర్తలు,  స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి ముందుకు వెళ్లాలని సూచించారు. బస్తి, కాలనీ సంఘాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని అవసరమైనవారికి  సాయం చేయాలని  విజ్ఞప్తి చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో వర్షాలతో ప్రజలకు కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సకాలంలో స్పందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని  సూచించారు.