రాష్ట్రంలో కుటుంబ పాలనను జనం అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తండ్రీ కొడుకుల పాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకోని కేసీఆర్.. పంజాబ్ రైతులకు సాయం చేసేందుకు వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు.
దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు వంద మంది కేసీఆర్ లు వచ్చినా మోడీని ఏం చేయలేరని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 2024లోనూ మోడీ సర్కారు మళ్లీ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. సైన్స్ సిటీ నిర్మాణం కోసం 25 ఎకరాలు ఇవ్వమని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైల్వే ప్రాజెక్టులకు భూ సేకరణ చేయకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే పనులు ముందుకుసాగడంలేదని విమర్శించారు. బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి.. కుటుంబపాలనను కూకుటివేళ్లతో పెకిలించి వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.